Ap News: సీపీఎస్‌ రద్దుపై సీఎం స్పష్టమైన వైఖరి: సీఎస్‌ సమీర్‌ శర్మ

ప్రభుత్వ ఉద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌ శర్మ కోరారు. సచివాలయంలో సీఎస్‌ సమీర్‌ శర్మ నేతృత్వంలో ఉద్యోగ సంఘాలతో

Updated : 29 Oct 2021 20:28 IST

ఉద్యోగ సంఘాలతో ముగిసిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌ శర్మ కోరారు. సచివాలయంలో సీఎస్‌ సమీర్‌ శర్మ నేతృత్వంలో ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. ఉద్యోగుల డిమాండ్లపై సమావేశంలో చర్చించారు. పీఆర్‌సీ అమలు, డీఏ బకాయిలు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల  వేతనాల పెంపు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయని.. అయినా సరైన వేళకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్‌ తెలిపారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని.. ఈ విషయంపై సీఎం జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారన్నారు. ఉద్యోగుల సమస్యలపై నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో ఉద్యోగులకు సీఎస్‌ సూచించారు. ఉద్యోగ సంఘాలతో ఇది ఒక ప్రాథమిక సమావేశం మాత్రమేనని.. మరోసారి భేటీ అవుదామని ఉద్యోగ సంఘాలకు సీఎస్‌ సూచించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం జగన్‌ దృష్టికి  తీసుకెళ్తానని సీఎస్‌ హామీ ఇచ్చారు.

త్వరలో అనుబంధ కమిటీలతో భేటీ: బొప్పరాజు

త్వరలోనే సంబంధిత కమిటీలతో భేటీ ఏర్పాటు చేస్తామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్ పొడిగింపుపై సమావేశంలో వివరించినట్లు చెప్పారు. ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులతో చర్చ ఏర్పాటు చేస్తామని సీఎస్‌ చెప్పారన్నారు. కారుణ్య నియామకాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని.. నియామకాల గురించి సీఎం చెప్పినా అమలు కాలేదన్నారు. మరోసారి జాయింట్‌ కౌన్సిల్‌ భేటీ ఏర్పాటు చేస్తామని.. తరుపరి భేటీలోగా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పినట్లు బొప్పరాజు పేర్కొన్నారు.

కంటితుడుపు చర్య మాత్రమే: బండి శ్రీనివాసరావు

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ ఒక కంటి తుడుపు చర్య మాత్రమేనని ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు అన్నారు. పీఆర్‌సీ నివేదికపై నాలుగు రోజుల్లో చెబుతాననడం సంతోషకరమైన విషమయన్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని