Ap News: కాలికి ట్యాగుతో పావురం.. ప్రకాశం జిల్లాలో కలకలం

కాలికి చైనా ట్యాగు ఉన్న ఓ పావురం ఒడిశాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకోవడం

Updated : 05 Jan 2022 16:05 IST

చీమకుర్తి: కాలికి చైనా ట్యాగు ఉన్న ఓ పావురం ఒడిశాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. జిల్లాలోని చీమకుర్తి శివారులో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంపై కాలికి ట్యాగుతో ఉన్న పావురం బుధవారం స్థానికుల కంట పడింది. గత రెండు నెలలుగా ఈ పావురం బహుళ అంతస్తుపై ఉంటుండగా.. ఆ భవన యజమాని గింజలు వేసి పెంచుతున్నారు. నిన్న ఒడిశాలో రెండు పావురాలు చైనా ట్యాగులతో కన్పించిన ఘటనపై ‘ఈనాడు’ వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తను చూసి భవన యజమాని స్పందించారు. వెంటనే ఈ విషయాన్ని మీడియా, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పోలీసులు వెంటనే పావురాన్ని స్వాధీనం చేసుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పావురం కాలికి ఉన్న ట్యాగుకు ‘ఏఐఆర్‌ 2022’ అని రాసి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిన్న ఒడిశాలోని సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో.. గాయంతో ఓ పావురం కింద పడిపోయింది. ఆ పావురాన్ని రక్షించేందుకు సర్బేశ్వర్ చొత్రాయ్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కాలికి చైనా ట్యాగ్ ఉన్నట్లు గుర్తించాడు. దానిపై చైనీస్ భాషలో ఏదో రాసి ఉన్నట్లు గమనించి.. పోలీసులకు సమాచారమిచ్చాడు. సర్బేశ్వర్ సమాచారంతో అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని