AP News: ఉద్యోగ సంఘాలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన: సజ్జల

రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి, సీఎస్‌ ఈరోజు ఆయా సంఘాలతో మరోసారి సమావేశవుతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Updated : 16 Dec 2021 17:46 IST

అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి, సీఎస్‌ ఈరోజు ఆయా సంఘాలతో మరోసారి సమావేశవుతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఈరోజు ఉండదని చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలసి సీఎం జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. నిన్న ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలతో పాటు ఉద్యోగులకు ఎంత మేర పీఆర్సీ ఇవ్వాలనే దానిపై సీఎంతో చర్చించామన్నారు.

ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ ఇస్తున్నామని.. గ్రాస్‌ వేతనం తగ్గకుండా చర్యలు తీసుకుంటామని సజ్జల చెప్పారు. ఉద్యోగుల మిగిలిన డిమాండ్లపైనా చర్చించామని.. అన్నింటినీ క్రమంగా పరిష్కరిస్తామన్నారు. కరోనా పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగాలేదని చెప్పారు. ఉద్యోగులకు ఇప్పుడిస్తున్న ఐఆర్‌ 27 శాతం కంటే ఎక్కువగానే లబ్ధి చేకూరేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. రేపటికి పీఆర్సీపై చర్చల ప్రక్రియ పూర్తికావొచ్చని సజ్జల తెలిపారు. రేపు లేదా సోమవారం ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు ఉండొచ్చని.. సంఘాల నేతలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని