Supreme Court: ఆలయాల్లో రోజువారీ కార్యకలాపాలను కోర్టులు చేపట్టవు: సుప్రీం

తిరుమల అంశంపై ఓ భక్తుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్వీరమణ ధర్మాసనం

Updated : 24 Sep 2022 15:43 IST

తిరుమల అంశంపై ముగిసిన విచారణ

దిల్లీ: తిరుమల అంశంపై ఓ భక్తుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ధర్మాసనం ఇవాళ విచారణను ముగించింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని పిటిషన్‌ దాఖలైంది. విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫు న్యాయవాది.. పూజలు, కైంకర్యాలన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. లోటుపాట్లు లేకుండానే స్వామివారికి సేవలు జరుగుతున్నాయని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆలయాల్లో రోజువారీ కార్యకలాపాలు కోర్టులు చేపట్టవని స్పష్టం చేసింది. వాటి పర్యవేక్షణ ఆగమశాస్త్ర పండితులు చూసుకుంటారని తెలిపింది.

కార్యకలాపాల్లో లోపాలున్నట్లు అనిపిస్తే స్థానిక సివిల్‌ కోర్టును ఆశ్రయించమని పిటిషనర్‌కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ప్రచారం కోసమే పిటిషన్‌ దాఖలు చేసినట్లు అనిపిస్తోందని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. లోటు పాట్లు లేవని తితిదే చెబుతోంది కదా అని ప్రశ్నించింది. ఏవైనా లోటుపాట్లు కనిపిస్తే ఆగమశాస్త్ర పండితుల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. మరోవైపు పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై 8 వారాల్లో సమాధానం ఇవ్వాలని తితిదేను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని