YouTuber: 42 సెకన్లలో ₹1.75 కోట్లు సంపాదించిన యూట్యూబర్‌

ఓ యూట్యూబర్​ ఓవర్​ నైట్​ కోటీశ్వరుడయ్యాడు. క్షణాల వ్యవధిలోనే కోట్లు సంపాదించాడు. కేవలం 42 సెకెన్లలోనే రూ. 1.75కోట్ల ఆర్జించాడు.......

Published : 19 Feb 2022 01:16 IST

కాలిఫోర్నియా: ఓ యూట్యూబర్​ ఓవర్​ నైట్​ కోటీశ్వరుడయ్యాడు. క్షణాల వ్యవధిలోనే కోట్లు సంపాదించాడు. కేవలం 42 సెకెన్లలోనే రూ. 1.75కోట్ల ఆర్జించాడు. క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీ అయిన నాన్-ఫంగబుల్ టోకెన్‌(ఎన్‌ఎఫ్‌టీ)లతో సెకన్ల వ్యవధిలో ఈ మొత్తాన్ని సంపాదించి ఓవర్‌నైట్​ సెన్సేషన్‌గా మారాడు. ఆయనే అమెరికాకు చెందిన జొనాథన్​ మా.

కాలిఫోర్నియాకు చెందిన ఈ యువ యూట్యూబర్​ ‘జోమా టెక్’ పేరుతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టో కరెన్సీ, టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఆయన ఛానెల్​కు 16 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. అయితే ఈ నెల ప్రారంభంలో ‘వ్యాక్సీడ్​ డాగ్​గోస్​’ పేరుతో జొనాథన్ మా ఎన్​ఎఫ్​టీ (నాన్-ఫంజిబుల్ టోకెన్) కలెక్షన్​ను విడుదల చేశారు. ఇదే ఆయనకు 2,34,000 డాలర్లు (సుమారు రూ. 1.75 కోట్లు) తెచ్చి పెట్టింది. అది కూడా కేవలం 42 సెకన్లలోనే. ఖర్చులు పోనూ రూ.1.40 కోట్లు మిగిలాయని అంచనా వేస్తున్నారు. సినిమాలకు దర్శకత్వం వహించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, ఈ డబ్బులతో మరికొద్ది రోజుల్లోనే ఆ కోరికను తీర్చుకోనున్నట్లు జొనాథన్‌ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఫేస్​బుక్​, గూగుల్​ లాంటి కంపెనీల్లో సాఫ్ట్​వేర్ ఉద్యోగిగా కూడా పని చేసినట్లు తెలిపారు.

ఏదైనా డిజిటల్ కళాకృతిని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ రూపంలో నిలువ చేయడాన్ని (ఓన‌ర్‌షిప్ సర్టిఫికేట్‌) ‘ఎన్ఎఫ్‌టీ’గా పేర్కొంటారు. ఎన్​ఎఫ్​టీలను ఉపయోగించి ఫొటోలు, వీడియోలు, ఆడియో ఇతర రకాల ఫైల్స్​ను దాచుకోవచ్చు. అయితే.. ఈ విధంగా కొనుగోలు చేసిన ప్రత్యేక డిజిటల్ ఆస్తిని నిజంగా మనచేతికి ఇవ్వరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని