Published : 05 Aug 2021 23:35 IST

Hockey: స్వర్ణయుగానికి నాంది పలికిన విజయమిది!

 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  మనదేశ క్రీడ హాకీలో ఒకప్పుడు సువర్ణాక్షరాలతో లిఖించిన చరిత్ర ఉన్నప్పటికీ, ఆ తర్వాతి కాలంలో మనజట్టు అంతగా రాణించలేకపోయింది. కానీ 41 సంవత్సరాల తర్వాత..  తిరిగి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం గర్వించదగ్గ విషయం. ఒకసారి గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, భారతదేశానికి హాకీలో ఉజ్వల చరిత్ర ఉంది. హాకీ మాంత్రికుడిగా పేరుగాంచిన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జట్టు, వరుసగా మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించింది. 1928లో ఆమ్‌స్టర్‌డ్యామ్‌, 1932లో లాస్‌ఏంజెలెస్‌, 1936లో బెర్లిన్‌లో విజయాలు సొంతం చేసుకుంది. దాంతో ధ్యాన్‌చంద్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. చాలామంది అతను ఉపయోగించే హాకీ స్టిక్‌కు, బంతికి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందనుకునేవారు. ఆయన ఆట తీరులో అంత ఈజ్‌ ఉండేది. ఆయన గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ తర్వాత 1948,1952,1956 వరకు ఒలింపిక్స్‌లో భారత జట్టు వరుస విజయాలు సాధించింది.  1964లో ఫైనల్స్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గెలిచింది. 1968లో పశ్చిమజర్మనీని ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది.  1972లో నెదర్లాండ్స్‌ను ఓడించి, కాంస్యం గెలుచుకుని మూడోస్థానంలో నిలబడింది. 1980 ఒలింపిక్స్‌లో మాస్కోలో ఆఖరుసారి స్పెయిన్‌ను ఓడించి బంగారు పతకం సాధించింది.  

హిట్లర్‌ మెప్పు పొందిన ధ్యాన్‌చంద్‌!
1936లో బెర్లిన్‌లో భారత్‌ పసిడి పతకం సాధించిన సమయంలో ఆ దేశాధినేత హిట్లర్‌ కలుగజేసుకుని ధ్యాన్‌చంద్‌ తమదేశానికి వస్తే, పౌరసత్వం ఇవ్వడమేగాక, సైన్యంలో పెద్ద హోదా కల్పిస్తానని ఆశ చూపారు. అయితే ధ్యాన్‌చంద్‌ దాన్ని తిరస్కరించారు. నిజానికి మన అప్పటికి వలసపాలనలోనే ఉన్నాం. ఇప్పటిలా దేశం అభివృద్ధి చెందలేదు.  పెద్దగా క్రీడాకారులకు సదుపాయాలు, ప్రోత్సాహం కూడా లేదు. అయినప్పటికీ పరాయిపాలనకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన జ్వాల, కసి, ఆక్రోశంతో మన ఆటగాళ్లు క్రీడల్లో వీరోచితంగా పోరాడేవారు.  నాడు జర్మనీ గడ్డపై ఆడిన భారత్‌ 8-1 గోల్స్‌తో జర్మనీని ఓడించింది. ధ్యాన్‌చంద్‌ నాలుగు గోల్స్‌ చేసి, విజయం వరించేలా చేశారు.  

టోక్యో పోరులో జర్మనీని ఓడించిన భారత్‌!
మళ్లీ 41 ఏళ్ల విరామం తర్వాత, టోక్యో ఒలింపిక్స్‌లో మూడోస్థానం కోసం జర్మనీతో బరిలోకి దిగిన భారత్‌, ఆ జట్టును 5-4  గోల్స్‌తో ఓడించి కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఇది చారిత్రాత్మక విజయం. ఇది రాబోయే సంవత్సరాల్లో హాకీలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని