Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 Apr 2024 12:59 IST

1. తండ్రి హయాం నుంచి డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్‌: బొండా ఉమా

రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. విజయవాడలో భాజపా నేత లంకా దినకర్, జనసేన మహిళా విభాగం నేత రాయపాటి అరుణతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిపరుడికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్‌ అని మండిపడ్డారు. పూర్తి కథనం

2. కాంగ్రెస్‌లో చేరిన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు

భారాసకు మరో షాక్‌ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.పూర్తి కథనం

3. పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల

ఐదేళ్ల జగన్‌ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గంలో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ జరిగిందన్నారు. రేషన్‌ మాఫియా లారీకి అడ్డొచ్చాడని ఉద్యోగిని హతమార్చారని ఆరోపించారు. పూర్తి కథనం

4. భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370.. ఎన్డీయే పక్షాలతో కలిసి 400పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆమె పర్యటించారు. దీనిలో భాగంగా గీతం వర్సిటీలో ‘వికసిత్‌ భారత్‌’ కార్యక్రమం కింద విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. పూర్తి కథనం

5. ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.పూర్తి కథనం

6. రిజర్వేషన్ల రద్దుపై అమిత్‌ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై దిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.పూర్తి కథనం

7. జైల్లో కేజ్రీవాల్‌ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తిహాడ్‌ జైల్లో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. సోమవారం ఆయనను కలిసి మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత (Sunita Kejriwal) అనుమతి కోరారు. అయితే ఇందుకు అధికారులు అంగీకరించలేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు వెల్లడించాయి.పూర్తి కథనం

8. రంగంలోకి బైడెన్‌.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్‌ అనుమతి

దాడులతో అతలాకుతలమైన గాజాలోకి మరింత సహాయ సామగ్రిని చేర్చే దిశగా అమెరికా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు.పూర్తి కథనం

9. అతడి హత్యకు పుతిన్‌ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ  (Alexei Navalny) మరణం వెనుక పుతిన్‌ ఆదేశాలు జారీ చేయలేదని అమెరికా నిఘా వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. చాలా కాలంగా జైల్లో ఉన్న నావల్నీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించారు. అంతిమంగా అతడి మృత్యువుకు మాత్రం పుతిన్‌ కారణమయ్యారని చెబుతున్నారు. పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికవ్వడానికి సరిగ్గా ముందు  ఈ ఘటన చోటు చేసుకొంది.పూర్తి కథనం

10. గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్‌ టర్నింగ్‌ స్పెల్ జడ్డూదే: రుతురాజ్‌

వరుసగా రెండు ఓటముల తర్వాత చెన్నై మళ్లీ పుంజుకుంది. కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98), డారిల్ మిచెల్ (52), దూబె (39) అదరగొట్టారు. దీంతో 212/3 స్కోరు చేయగలిగింది. అనంతరం హైదరాబాద్‌ 134 పరుగులకే ఆలౌటైంది. తుషార్ దేశ్‌పాండే (4/27), జడేజా (1/22), పతిరన (2/17), ముస్తాఫిజుర్ (2/19) బౌలింగ్‌లో రాణించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని