Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Jul 2022 13:08 IST

1. యావత్‌ దేశం తరఫున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

యావత్‌ భారతావనికే మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాల సందర్భంగా ఆయన పుట్టిన నేలపై మనమంతా కలుసుకోవడం అదృష్టమని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడారు. మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రసంగంలో ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’ అనే విప్లవ గీతాన్ని ఆయన ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్‌ శిందే..

మహారాష్ట్ర (Maharashtra) నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్ష (Trust Vote)లో మెజార్టీ మార్క్‌(144)ను దాటి 164 మంది ఎమ్మెల్యేలు శిందే సర్కాకుకు మద్దతుగా ఓటేశారు. దీంతో బలపరీక్షలో సీఎం నెగ్గినట్లు స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ప్రకటించారు. ఈ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే భాజపా, శివసేన నేతల ప్రతిపాదన మేరకు స్పీకర్‌ విశ్వాస పరీక్ష చేపట్టారు. తొలుత మూజువాణీ ఓటు ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నా శ్రేయోభిలాషుల కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నా: రఘురామ

 ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటనకు తాను హాజరుకావడం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయల్దేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం రాత్రి అర్ధంతరంగా వెనుదిరిగారు. బేగంపేట రైల్వేస్టేషన్‌లో ఆయన దిగిపోయారు. ఈ క్రమంలో తన భీమవరం పర్యటన రద్దుకు గల కారణాలపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మోదీజీ.. కేసీఆర్‌ ప్రశ్నలకు సమాధానాలేవీ?: తలసాని

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చప్పగా సాగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ధాన్య కొనుగోలు చేశామని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటని.. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో తలసాని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే: కేటీఆర్‌

5. Credit cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉండొచ్చా?

క్రెడిట్‌ కార్డుల (Credit Card)ను సరిగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రోజువారీ ఖర్చులపై రాయితీ కూడా పొందొచ్చు. చాలా సందర్భాలకు ఒకే కార్డు అవసరమైనప్పటికీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ కార్డులు ఉండడం అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తాయి. చాలా మందికి ఎన్ని క్రెడిట్‌ కార్డు (Credit Card)లు ఉండాలనే విషయంపై సందేహం ఉంటుంది. దీన్ని ఎలా నిర్ణయించుకోవాలో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇంగ్లాండ్‌ గడ్డపై బుమ్రా మరో రికార్డు..

టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టంచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ బుమ్రా.. మరో ఘనత సాధించాడు. ఇంగ్లాడ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత్‌ - ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఐదో టెస్టు జరుగుతోన్న విషయం తెలిసిందే. గతేడాదే ఈ సిరీస్‌ ప్రారంభమవ్వగా.. కొవిడ్‌ కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 16 మంది దుర్మరణం

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్లు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో స్కూల్‌కు వెళ్లే చిన్నారులు ఉన్నారు. కుల్లు జిల్లాలోని జంగ్లా గ్రామం సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సైంజ్‌ ప్రాంతానికి వెళ్తోన్న ఈ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడింది. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. SC: అగ్నిపథ్‌పై పిటిషన్లు.. వచ్చే వారం విచారించనున్న సుప్రీం

దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసిన అగ్నిపథ్‌ పథకంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చేవారం దీనిపై వాదనలు విననున్నట్లు వెల్లడించింది. యువత సాయుధ బలగాల్లో స్వల్పకాలం సేవలందించే నిమిత్తం కేంద్రం గత నెల అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే ఈ ఏడాదికి ఆ పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఎంపికైన వారు అగ్నివీరులుగా నాలుగేళ్లపాటు సేవలు అందిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. India Corona: 16 వేల కొత్త కేసులు..24 మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 3.32 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,135 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కూడా అదే స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి చేరింది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Alluri: ఆకట్టుకునేలా ‘అల్లూరి’ టీజర్‌.. పోలీస్‌ పాత్రలో అదరగొట్టిన శ్రీవిష్ణు

‘‘విప్లవానికి నాంది చైతన్యం. చైతన్యానికి పునాది నిజాయతీ. నిజాయతీకి మారుపేరు అల్లూరి సీతారామరాజు’’ అంటున్నారు నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘అల్లూరి’ (Alluri). పోలీస్‌ అధికారి ఫిక్షనల్‌ బయోపిక్‌గా ఇది సిద్ధమవుతోంది. ప్రదీప్‌వర్మ (Pradeep Varma) దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఈ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని