ఘోరం: లోయలో పడిన బస్సు.. 12మంది దుర్మరణం

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్లు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 12మంది దుర్మరణం చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు.....

Updated : 04 Jul 2022 14:51 IST

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్లు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 12మంది దుర్మరణం చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు జిల్లా అధికారులు వెల్లడించారు. కుల్లు జిల్లాలోని జంగ్లా గ్రామం సమీపంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు షయిన్‌షెర్‌ ప్రాంతం నుంచి సైంజ్‌కు వెళ్తుండగా జంగ్లా గ్రామం సమీపంలో ఓ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిందని తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అయితే, తొలుత ఈ దుర్ఘటనలో 16మంది మృతిచెందినట్టు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

రాష్ట్రపతి, ప్రధాని విచారం

ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలిపారు. మరోవైపు, ఈ ఘటనలో మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక అధికారులు తగిన సహాయ సహకారారాలు అందించాలని ఆదేశిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలో మృతులకు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా సంతాపం తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని