Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 05 Dec 2021 16:55 IST

1.థర్డ్‌వేవ్‌పై భయం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: డీహెచ్ శ్రీనివాస్‌రావు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాస్‌రావు తెలిపారు. కొవిడ్‌ను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు.  దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని.. అక్కడ కరోనా కేసులు 8నుంచి 16 శాతానికి చేరాయన్నారు. వీటిలో 75శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని చెప్పారు.

2.వచ్చే రెండు నెలల్లో.. స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌!

డెల్టా ప్రభావంతో వణికిపోతోన్న ప్రపంచ దేశాలను కొత్త రూపంలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరోసారి కలవరపెడుతోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్‌ ప్రభావంతో రానున్న రోజుల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఇప్పటికే ఆయా దేశాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన దేశంలో స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌ కనిపించనుందని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అంచనా వేశారు.

3.అసలు కేంద్ర హోం శాఖ ఏం చేస్తున్నట్లు?: రాహుల్‌ గాంధీ

నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో శనివారం సాయంత్రం భద్రతాబలగాలు మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపిన ఘటనలో.. 13 మంది మృతి చెందగా, మరో 11 మందికి తీవ్ర గాయాలయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు.

4.ఎంపీలు పోరాడినా కేంద్రం వైఖరి మారలేదు.. యాసంగిలో వరి వద్దు: నిరంజన్‌రెడ్డి

యాసంగిలో రైతులు వరి వేయొద్దని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి మరోసారి రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వరికి బదులు ఇతర  పంటలు వేస్తేనే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రత్యాయ్నాయ పంటలపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు.

5.కేజ్రీవాల్‌ ఇంటిముందు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ నిరసన!

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం వేడుక్కుతోంది. ముఖ్యంగా పంజాబ్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోన్న ఆమ్‌ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తోంది. వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు పంజాబ్‌ కాంగ్రెస్‌ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా నేడు దిల్లీ ముఖ్యమంత్రి ఇంటివద్ద పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ బైఠాయించారు.

6.ఈ సారి కీలక రేట్లు యథాతథం.. రేపటి నుంచి ఎంపీసీ భేటీ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు అలముకొన్న వేళ కీలక వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా ఉంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తూనే వృద్ధికి దోహదం చేసే విధంగా కీలక వడ్డీ రేట్లను సవరించే విషయంలో మరింత అనుకూల సమయం కోసం ఆర్‌బీఐ వేచి చూడొచ్చని పేర్కొన్నారు.

7.బహుభాషల్లో ఇంటర్నెట్‌.. అత్యవసరం: కేంద్రమంత్రి

డిజిటల్‌ ఇండియాను సాకారం చేయడం కోసం భారతీయులందరికీ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ను బహుభాషల్లో తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భారత్‌.. డిజిటల్‌ ఇండియాగా మారాలంటే బహుభాషా ఇంటర్నెట్‌ అత్యవసరమన్నారు.

8.‘ఇక్కడికి ఎలా వచ్చామో అలానే వెళ్లిపోదాం’..  ‘పుష్ప’ షూట్‌లో అల్లు అర్జున్‌!

డిసెంబరు 27న విడుదలకానున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తూ చిత్ర బృందం అంచనాల్ని పెంచుతోంది. ఇప్పటికే పలు పోస్టర్లు, పాటలు, టీజర్లు విడుదల చేసిన టీమ్‌ తాజాగా మేకింగ్‌ వీడియోను పంచుకుంది. ఓ అడవిలో చిత్రీకరించిన దృశ్యాల్ని ఇందులో చూడొచ్చు. ఈ షూటింగ్‌ ప్రారంభమవకముందు అల్లు అర్జున్‌ చిత్ర బృందానికి ఓ విజ్ఞప్తి చేశారు.

9.ప్రపంచమే మారిపోయినట్టు అనిపించింది..

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రతిష్ఠాత్మక క్విజ్‌ షో ‘ కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) ఇటీవలే 1000 ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి 1000 స్పెషల్‌  ఎపిసోడ్‌లో అమితాబ్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమితాబ్‌ కుమార్తె శ్వేతా బచ్చన్‌, మనవరాలు నవ్యా నవేలి హాజరయ్యారు.

10.చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని