Updated : 19 May 2022 21:02 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. లండన్‌ కింగ్స్ కాలేజ్‌తో ఒప్పందం.. భారత్, యూకే సంబంధాలు మరింత బలోపేతం: కేటీఆర్‌

ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకడమిక్ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కింగ్స్‌ కాలేజ్ కలిసి పనిచేయనుంది. యూకే పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, కింగ్స్ హెల్త్ పార్ట్‌నర్స్ ఈడీ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్‌లో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

2. నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమో?: ఏబీ వెంకటేశ్వరరావు

తనను కలవడం ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు ఇష్టం లేదేమోనని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు. తన సస్పెన్షన్‌ చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చిందని చెప్పారు. ఈ విషయంలో చట్టప్రకారమే తాను ముందుకెళ్లానన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడారు.


Viral Video: శ్రీకాకుళంలో బరితెగించిన చైన్‌ స్నాచర్లు


3. మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా పౌరసరఫరాల శాఖ: నాదెండ్ల మనోహర్‌

ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుల నుంచి బస్తాకు రూ.200 చొప్పున దోచుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఈ దోపిడీకి సూత్రధారులు ఎవరో రైతాంగానికి, ప్రజలకు అర్థమవుతోందని తెలిపారు. రైతులను దోచుకోవడానికి ఈ పాలకులకు మనసెలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సు పట్టని వ్యక్తి సీఎంగా ఉండటం వల్లే రైతన్నలు, కౌలు రైతులు జీవితంపై విరక్తి చెందుతున్నారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

4. జీఎస్‌టీ మండలి సిఫార్సులపై సుప్రీం కీలక తీర్పు..

జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) మండలి సిఫార్సులపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మండలి చేసే ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్నందున వాటికి విలువ ఇవ్వాలని సూచించింది. జీఎస్‌టీ చట్టాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన హక్కులు ఉన్నాయని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

5. సంపదను సృష్టించడమే ప్రైవేటు రంగం పని..!

సంపదను సృష్టించడమే ప్రైవేటు రంగం పని అని.. ప్రభుత్వం మాత్రం విధానాల రూపకల్పనపైనే దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. గవర్నమెంట్‌ టెక్‌ సమ్మిట్‌ 2022లో పాల్గొన్న ఆయన.. భారత్‌కు సమర్థమంతమైన, పారదర్శక ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పురోగతి, ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిపుణులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.


KA Paul : కేసీఆర్‌ నిజస్వరూపం బయటపడింది..: కేఏ పాల్‌


6. ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. #ఎన్టీఆర్‌30 అప్‌డేట్‌ వచ్చేసింది

#NTR30 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఆ ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ పుట్టినరోజు (శుక్రవారం) సందర్భంగా చిత్ర బృందం ఈ కానుకను అందించింది. ‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి ఉండకూడదని.అప్పుడు భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా’ అంటూ ఎన్టీఆర్​ చెప్పిన ​ఫుల్​ డైలాగ్​ అదిరిపోయింది.

7. మూడేళ్లు వృథా చేసుకున్నా.. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు!

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఏ రాజకీయ పార్టీలో చేరాలనే అంశంపై ఇంకా తాను ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని గుజరాత్‌లోని పాటీదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి నిన్న రాజీనామా చేయడంతో హార్దిక్‌ భాజపాలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై అహ్మదాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటివరకైతే భాజపా లేదా ఆప్‌.. ఏ పార్టీలో కూడా తాను చేరే అంశంపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు. తనలాగే కాంగ్రెస్‌ పార్టీలో అనేకమంది అసంతృప్తితో ఉన్నారంటూ హార్దిక్‌ బాంబుపేల్చారు.

8. నిబంధనలు పాటించండి.. లేదంటే భారత్‌ నుంచి వెళ్లిపోండి

భారత్‌ రూపొందించిన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు నడుచుకోవాల్సిందేనని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఒకవేళ వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు లేదా ఇతర వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు నూతన మార్గదర్శకాలను పాటించకుంటే దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వారికి మరోమార్గం లేదని తేల్చిచెప్పారు. సైబర్‌ ఉల్లంఘనల నమోదుపై ఇటీవల రూపొందించిన మార్గదర్శకాలపై తరచూ అడిగే ప్రశ్నలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు.


Video: అతి దాహానికి అడ్డుకట్ట వేయడం ఎలా?


9. అలెర్ట్‌.. టీ20 లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సమయం మారింది!

మెగా టీ20 టోర్నీలో ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం మ్యాచ్‌ల్లో కొన్ని మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతున్నాయి కదా.. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం రాత్రి 8 గంటలకు మొదలవుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అంటే టాస్‌ 7.30 గంటలకు వేసి అర్ధ గంట తర్వాత మ్యాచ్‌ను స్టార్ట్‌ చేస్తారు. ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ముగింపు సంబరాలను అద్భుతంగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

10. ఈ టీమ్‌ఇండియా దిగ్గజంతో బ్యాటింగ్‌ చేయడమంటే ఇష్టం: సంగక్కర

ఆ ఇద్దరూ క్రికెట్‌ లెజెండ్స్.. ఆటపరంగా తమ దేశం కోసం ఎంతో శ్రమించారు. ఇప్పుడు వారిద్దరూ టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ జట్టుకు తమ విలువైన సూచనలు, సలహాలు ఇస్తూ నడిపిస్తున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ దిగ్గజ ఆటగాళ్లు ఎవరో.. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, లసిత్ మలింగ.. ఒకరేమో బౌలర్లను భయపెడితే.. ఇంకొకరు బ్యాటర్లను హడలెత్తించిన మాజీ క్రికెటర్లు. ప్రస్తుతం సంగక్కర రాజస్థాన్‌ జట్టులో డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. మలింగ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని