Published : 20 May 2022 01:33 IST

Andhra News: మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా పౌరసరఫరాల శాఖ: నాదెండ్ల మనోహర్‌

అమరావతి: ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుల నుంచి బస్తాకు రూ.200 చొప్పున దోచుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఈ దోపిడీకి సూత్రధారులు ఎవరో రైతాంగానికి, ప్రజలకు అర్థమవుతోందని తెలిపారు. రైతులను దోచుకోవడానికి ఈ పాలకులకు మనసెలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సు పట్టని వ్యక్తి సీఎంగా ఉండటం వల్లే రైతన్నలు, కౌలు రైతులు జీవితంపై విరక్తి చెందుతున్నారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాం.. ఆఫ్రికా కూడా ఆదర్శంగా తీసుకుంటోందని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు వరి రైతుల బాధలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

‘‘రైతులకు భరోసా ఇవ్వని కేంద్రాలు ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? ఆర్బీకేల్లో ధాన్యం అమ్మడానికి వెళ్ళిన రైతులకు ఎదురౌతున్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయి. దళారులకు నిలయాలుగా ఆర్బీకేలు మారిపోయాయి. రైస్ మిల్లర్లు రైతుల బాధలను ఆసరాగా చేసుకొని గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. రైతుల ఆధార్ వివరాలు నమోదు చేయకుండా మిల్లర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్వాహకులు, పౌరసరఫరాల శాఖ చేస్తున్న మాయ వల్ల అన్నదాతలు మోసపోతున్నారు. వేల మంది రైతుల చిరునామాలు గల్లంతు చేసి కుంభకోణానికి తెర తీశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం తేలిగ్గా తీసుకొంది. ఇది ఒక సమస్యే కాదని ఉన్నతాధికారులు, మంత్రులతో చెప్పించడం ద్వారా ఈ కుంభకోణంలో ఉన్న పెద్దలెవరో అర్థమవుతోంది.

రైతుల నుంచి ధాన్యం సేకరించి సకాలంలో నగదు చెల్లించాల్సిన పౌరసరఫరాల శాఖ.. మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా మారింది. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. రైతులకు గోనె సంచులు, రవాణా ఛార్జీలు ఇవ్వడం లేదు. ఆ బాధలేవో రైతులే పడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేరిస్తే, సొమ్ములు ఇవ్వడం లేదు. తొలకరి పంట సమయం మొదలవుతోంది. అన్నదాతలకు పంట పెట్టుబడులు అవసరం అవుతాయి. ధాన్యం అమ్మిన డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే ఎలా? ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై జనసేన పార్టీ పోరాటం కొనసాగిస్తుంది’’ అని నాదెండ్ల పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని