TTD: తితిదే కీలక నిర్ణయాలు.. భక్తుల రద్దీ తగ్గాకే సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు

తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు పాల్గొని తితిదే ఉత్సవాలు

Published : 12 Jul 2022 01:51 IST

తిరుమల: తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు పాల్గొని తితిదే ఉత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి తీర్మానాలు ఆమోదించారు.  సమావేశం ముగిసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వరకు తిరుమాడ వీధుల్లో కరోనా తర్వాత మొదటి సారి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. తిరుపతిలో సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ విధానంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామన్నారు. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో టైమ్‌ స్లాట్‌ టోకెన్లు జారీ చేయకూడదని నిర్ణయించామన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై మరింత అధ్యయనం చేసిన అనంతరం టోకెన్ల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

 శ్రీవారి వైభవోత్సవాలను ఆగస్టు 16 నుంచి 20వరకు నెల్లూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.154.54 కోట్లతో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. తిరుమలలోని పార్వేట మండపం స్థానంలో కొత్త మండపాన్ని రూ.2.17కోట్లతో నిర్మించేందుకు బోర్డు నిర్ణయించిందన్నారు. ఎస్వీ గోశాలలో పది నెలలకు పశుగ్రాసం కొనుగోలుకు రూ.7.32కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. అమరావతిలో నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రాంగణంలో రూ.2.94కోట్లతో పూలతోటలు, గ్రీనరీ పెంచనున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బేడీ ఆంజనేయ స్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయించామన్నారు. మెరుగైన విద్య లక్ష్యంతో తిరుమల ఎస్వీ పాఠశాలను సింఘానియా గ్రూపులకు అప్పగించనున్నట్టు చెప్పారు. స్విమ్స్‌ ఆసుపత్రిలో ఐటీ అభివృద్ధికి రూ.4.20కోట్లు కేటాయించనున్నట్టు చెప్పారు. శ్రీవారి పోటు ఆధునికీకరణలో భాగంగా ఆటోమేటిక్‌ బూందీ తయారీపై ఆస్ట్రేలియా సంస్థ సాంకేతికతపై చర్చించామన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా 12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయాలని పాలకమండలి తీర్మానించిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని