TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. ఆర్జితసేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు

కొవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో తితిదే పలు నిర్ణయాలు తీసుకుంది.

Published : 20 May 2023 19:40 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో తితిదే పలు నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40గంటల సమయం పడుతోంది. శుక్ర, శనివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్‌ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

శుక్ర, శనివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దు చేసినట్టు తెలిపారు. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా  నిర్వహిస్తారని, దీంతో 30 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. దీంతో ప్రతి రోజూ 3గంటల సమయం ఆదా అవుతుందన్నారు. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాదిమంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామి వారి దర్శనం లభిస్తుందన్నారు. తితిదే నిర్ణయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని తితిదే ఛైర్మన్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు