Amaravati: విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు: కేంద్రం

ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం మరోసారి తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పింది. విభజన చట్టం ప్రకారమే రాజధానిని నోటిఫై చేశారని పునరుద్ఘాటించింది.

Updated : 08 Feb 2023 15:47 IST

దిల్లీ: విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh) రాజధానిగా అమరావతి (Amaravathi)ని 2015లో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని కేంద్రం తెలిపింది. బుధవారం వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని.. ఈ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు, నివేదికలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా.. దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాజధానిగా అమరావతినే ఎంపిక చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని (ఏపీసీఆర్‌డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చినట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు వివరించింది.

ఇదే సందర్భంలో 2020లో ఏపీసీఆర్‌డీఏను రద్దు చేసినట్టుగా, మూడు రాజధానుల ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిందన్నారు. అనంతరం ఆ బిల్లును వెనక్కి తీసుకుంటూ ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని కొనసాగింపుగా మరొక బిల్లును ముందుకు తీసుకొచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం వివరించింది. రాజధానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? అనే ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని పేర్కొంది. దీనిపై మాట్లాడటం సబ్‌జ్యుడిస్‌ అవుతుందని లిఖిత పూర్వక జవాబు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని