ఇవి తింటే ఎముకలకు బలం

ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగటంతో ఇప్పుడంతా చిరుధాన్యాల మీదే దృష్టి సారిస్తున్నారు. బరువు తగ్గాలన్నా, శరీర సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నా, గ్లూకోజు

Published : 06 Jan 2021 10:50 IST

ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగటంతో ఇప్పుడంతా చిరుధాన్యాల మీదే దృష్టి సారిస్తున్నారు. బరువు తగ్గాలన్నా, శరీర సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నా, గ్లూకోజు అదుపులో ఉంచుకోవాలన్నా వీటి వంకే చూస్తున్నారు. రాగులు, సజ్జల వంటివి ప్రస్తుతం చాలామంది వంటింట్లో దర్శనమిస్తుండటమే దీనికి నిదర్శనం. చూడటానికి చిన్నవే కావొచ్చు గానీ ఇవి పోషకాల గనులు! ప్రొటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాల వంటి అత్యవసర పోషకాలెన్నో దండిగా ఉంటాయి. మేలురకం పిండి పదార్థాలు ఉండటం వల్ల జీర్ణక్రియ నియంత్రణకూ తోడ్పడతాయి. అన్నింటికన్నా మంచి విషయం- చాలాసేపు కడుపు నిండిన భావన కలిగించటం. ఇలా త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు? రాగులు, సజ్జలు ఎముక పుష్టికీ తోడ్పడతాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలు తగ్గటానికీ దోహదం చేస్తాయి. సాధారణంగా కీళ్ల సమస్యలతో బాధపడేవారికి ధాన్యాలు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. వీటిల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కానీ చిరుధాన్యాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇవి వాపు ప్రక్రియను తగ్గించే గుణం.. ఎముకల బలోపేతానికి అవసరమైన పోషకాలు కలిగుండటమే దీనికి కారణం.

* రాగులు, సజ్జలకు వాపు ప్రక్రియను నివారించే గుణముంది. దీంతో కీళ్లలో వాపు తగ్గుతుంది. కీళ్ల అరుగుదలతో వేధించే నొప్పులు తగ్గుముఖం పడతాయి.

* రాగుల్లో క్యాల్షియం దండిగా ఉంటుంది. వంద గ్రాముల రాగులతో 244 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. అందువల్ల ఎముకలు క్షీణించటం, ఎముకలు విరిగిపోయే ముప్పు తగ్గుతుంది.

* సజ్జల్లో ఫాస్ఫరస్‌ శాతం ఎక్కువ. ఇది క్యాల్షియంతో కలిసి ఎముకలు బలోపేతం కావటానికి తోడ్పడుతుంది. వంద గ్రాముల సజ్జల్లో 42 మి.గ్రా. క్యాల్షియం, 296 మి.గ్రా. ఫాస్ఫరస్‌ ఉంటాయి.

- అందువల్ల రాగులు, సజ్జలను ఆహారంలో విధిగా చేర్చుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటి పిండితో రొట్టెలు చేసుకొని తినొచ్చు. రాగుల జావ కాచుకొని తాగొచ్చు. కాస్త బెల్లం కలిపితే దీన్ని పిల్లలూ ఇష్టంగానే తాగుతారు. ప్రస్తుతం చిరుధాన్యాలతో సిద్ధం చేసిన అటుకుల వంటివీ అందుబాటులో ఉంటున్నాయి. వీటినీ వాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని