Adibatla kidnap case: నవీన్‌రెడ్డి నన్ను కిడ్నాప్‌ చేసి ఘోరంగా ట్రీట్‌ చేశాడు: వైశాలి

నవీన్‌రెడ్డి తనను చిత్రహింసలకు గురి చేశాడని నిన్న అపహరణకు గురైన దంత వైద్యవిద్యార్థిని వైశాలి మీడియాకు వెల్లడించారు.  నిన్న సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్‌ (Adibatla kidnap case) ఘటనకు సంబంధించి వివరాలను ఆమె తెలిపారు.

Published : 11 Dec 2022 01:27 IST

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడ యువతి కిడ్నాప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.  నవీన్‌రెడ్డి (Naveen reddy) తనను చిత్రహింసలకు గురి చేశాడని నిన్న అపహరణకు గురైన దంత వైద్యవిద్యార్థిని వైశాలి (Vaisali) మీడియాకు తెలిపారు. ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడలో నిన్న సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్‌ ఘటనకు సంబంధించి వివరాలను ఆమె వెల్లడించారు.

‘‘నన్ను పెళ్లి చేసుకుంటానని బంధువు ద్వారా సంప్రదిస్తే ఇష్టం లేదని చెప్పా. అప్పటి నుంచి నవీన్‌రెడ్డి వేధించడం మొదలుపెట్టాడు. ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌  క్రియేట్‌ చేసి.. నా మార్ఫింగ్‌ ఫొటోలు పెట్టాడు. బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ‘నువ్వంటే నాకిష్టం.. బాగా చూసుకుంటా. వచ్చేయొచ్చు కదా’ అనేవాడు. నో అని చెబితే ఇంటి ముందుకొచ్చి న్యూసెన్స్‌ చేసేవాడు. నన్ను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన తర్వాత కారులో నవీన్‌రెడ్డి ఒక్కడే ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. జుట్టుపట్టుకుని ముఖంపై దాడి చేశాడు. మా పేరెంట్స్‌ కూడా అలా ఎప్పుడూ కొట్టలేదు. చాలా ఘోరంగా ట్రీట్‌ చేశాడు. ‘నాకిష్టం లేదు ఎందుకొచ్చావంటే’.. ‘నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నాకు దక్కకుంటే.. నిన్ను ఎవరికీ దక్కనివ్వను’ అంటూ చిత్ర హింసలకు గురి చేశాడు. ‘నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది’ అని బెదిరించాడు. తాను చెప్పినట్టు వినకపోతే మా నాన్నను చంపేస్తానని బెదిరించాడు. పోలీసులు మాకు భద్రత కల్పించాలి. ఈ ఘటనతో నా కెరీర్‌ దెబ్బతింటోంది. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. నవీన్‌రెడ్డి దొరికిపోయాడు కాబట్టి కాపాడుకునేందుకు  అతని తల్లి అబద్దాలు చెబుతోంది. ఒక మహిళగా ఆలోచించాలి. మా తల్లిదండ్రులకు ఏమైనా జరిగి ఉంటే ఎవరిది బాధ్యత. నవీన్‌రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. పెళ్లి జరిగిందని వారు చెబుతున్న రోజు నేను ఆర్మీ డెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. కారు ఇన్సూరెన్స్‌లో నాపేరు నామినీగా పెట్టాడు.. దానికి నాకూ ఏం సంబంధం. నేను ఎక్కడా సంతకం చేయలేదు’’ అని వైశాలి మీడియాకు వెల్లడించారు.

36మందిపై కేసు నమోదు..

కిడ్నాప్‌ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 36మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 32 మందిని అరెస్టు చేశారు. వైద్యపరీక్షల అనంతరం ఇబ్రహీంపట్నం సెషన్స్‌ కోర్టులో హాజరుపర్చనున్నారు.  పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌ సహా శివారు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని