Global Investors summit: పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం: సీఎం జగన్‌

విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌) పూర్తయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు అభినందనలు తెలిపారు.

Updated : 04 Mar 2023 17:13 IST

విశాఖ: విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌) పూర్తయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, వనరులు, పరిస్థితులను దేశవిదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు అభినందనలు తెలిపారు. మొత్తంగా 15 రంగాల్లో పెట్టుబడులు వచ్చాయన్న సీఎం.. సదస్సు విజయవంతం అయిందని సంతోషం వ్యక్తం చేశారు.

గత మూడేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందుకు వెళ్తోందని.. నూతన పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పారదర్శక పాలనతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అభినందనీయమన్నారు. చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నామని.. గ్రీన్‌ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. రెండు రోజుల సదస్సులో 352 ఒప్పందాలు (ఎంవోయూ) జరగ్గా.. మొత్తంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని.. పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.

ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం నుంచి సహకారం: కిషన్‌రెడ్డి

‘‘ఏపీలో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొదువ లేదు. పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రోడ్లు, రైల్వే, పోర్టుల వంటి రంగాల్లో అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. దేశంలో అంతర్జాతీయ రహదారుల అభివృద్ధి వేగంగా సాగుతోంది. పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగింది. నూతన భారత నిర్మాణం వేగంగా జరుగుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందుతోంది. గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు పెరిగాయి. ఏపీతో పాటు దేశాభివృద్ధికి సహకరిస్తున్న పెట్టుబడిదారులకు అభినందనలు. సమాఖ్య స్ఫూర్తితో ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం నుంచి సహకారం అందిస్తాం’’ అని కేంద్రం మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని