ఆన్‌లైన్‌లో భర్తను అమ్మకానికి పెట్టిన భార్య.. ఎందుకో తెలుసా?

భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు  మనస్పర్ధలు, గొడవలు రావడం సర్వసాధారణం. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉంటూ పిల్లలను, కుటుంబ బాధ్యతలను చూసుకోవాల్సిన భార్యభర్తలు.. చిన్న చిన్న విషయాలకే

Published : 03 Feb 2022 17:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు, గొడవలు రావడం సర్వసాధారణం. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉంటూ పిల్లలను, కుటుంబ బాధ్యతలను చూసుకోవాల్సిన భార్యభర్తలు.. చిన్న చిన్న విషయాలకే గొడవపడి విడాకులు తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇలాంటి ఘటనే ఒకటి న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. తనను, పిల్లలను వదిలేసి భర్త చేపల వేటకు వెళ్తున్నాడనే  కోపంతో ఓ మహిళ ఏకంగా అతనిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. న్యూజిలాండ్‌లో ట్రేడ్‌మీ అనే పాపులర్‌ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించి ప్రకటన ఇచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. లిండా మెక్‌అలిస్టర్,జాన్‌ రోమింగ్ అనే భార్యాభర్తలు  2019లో వివాహం చేసుకుని న్యూజిలాండ్ లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, ఇటీవల మెక్అలిస్టర్‌ తన భర్తను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టింది. అతని కోసం ప్రత్యేకంగా ఓ ప్రొఫైల్‌ని రూపొందించి ట్రెడ్‌మీ అనే వెబ్‌సైట్‌లో ఉంచింది. ‘యూజ్డ్ కండిషన్ ’ అనే ట్యాగ్‌ని పెట్టి ‘నా భర్త 6 అడుగుల ఒక అంగుళం పొడవుంటాడు. వయసు 37 ఏళ్లు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకుంటాడు. ఎంతో నిజాయతీపరుడు. నో రిటర్న్‌ ఎక్స్ఛేంజ్‌ ’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇలా చేయడానికి గల కారణం ఏంటని అడిగితే..  ఆమె చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యపోయారు. తన భర్తకు చేపల వేటకు వెళ్లే  అలవాటు ఉందని.. అందుకోసం తనని, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడని పేర్కొంది. తన భర్తతో గడపడమంటే తనకు చాలా ఇష్టమని, అతడేమో చెప్పకుండా వెళ్లిపోతాడని తెలిపింది.  ఈ విషయం గురించి ఎన్నోసార్లు అతనితో మాట్లాడినా పట్టించుకోవడం లేదని.. అందుకే విసుగు చెంది ఇలా చేశానని  లిండా చెప్పింది. ఈ ప్రకటనపై ఫిర్యాదులు రావడంతో సంబంధిత వెబ్‌సైట్‌ దాన్ని తొలగించింది. ఆసక్తికరమైన విషయమేంటంటే..  భార్య అమ్మకానికి ఉంచిన సంగతి జాన్‌కి అతని స్నేహితులు చెప్పేవరకు తెలియదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని