Panaji: 10ఏళ్ల బాలుడి సాహసం.. నీటిలో మునుగుతున్న స్నేహితులను కాపాడి..

గోవాకు చెందిన ఓ పదేళ్ల బాలుడు తన ప్రాణాలను పణంగా పెట్టి స్నేహితులను కాపాడాడు. చిన్నారి ధైర్యసాహసాలను ప్రశంసించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌  రూ. లక్ష బహుమతిని అందించారు.

Updated : 01 Apr 2023 16:50 IST

పనాజీ: సాధారణంగా పదేళ్ల వయసున్న చిన్నారులు స్నేహితులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతుంటారు. ఆ వయసులో ఏదైనా ప్రమాదం ఎదురైతే.. భయాందోళనలకు గురవుతారు.   కానీ ఈ పదేళ్ల బాలుడు మాత్రం అలా చేయలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ మిత్రులను రక్షించి ఔరా అనిపించాడు. ఆ చిన్నారి ధైర్యసాహసాలను ఇప్పుడు గోవా అంతా ప్రశంసిస్తోంది. అసలేం జరిగిందంటే..

రాష్ట్ర రాజధాని పనాజీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబార్జువాలో గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా నలుగురు స్నేహితులు అక్కడికి వెళ్లారు. రంగులు చల్లుకుని ఆడుకున్నారు. అనంతరం దగ్గర్లోని న నది వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ వారిలో ముగ్గురు పిల్లలు నీటిలో జారి పడిపోయారు. వారికి ఈత రాక మునిగిపోయారు. ఇదంతా చూసిన మరో బాలుడు అంకుర్‌కుమార్‌ సంజయ్‌ ప్రసాద్‌ (Ankurkumar Sanjay Prasad) వెంటనే అప్రమత్తమయ్యాడు. తన ప్రాణాలను పణంగా  పెట్టి నీటిలో దూకాడు. ఒకరి తరవాత ఒకరిని ఒడ్డుకు చేర్చాడు. సీపీఆర్‌ చేయడంతో వారు తేరుకున్నారు. అనంతరం స్థానికుల సాయంతో అంబులెన్స్‌కు ఫోన్‌ చేశాడు. ఎంతో ధైర్యసాహసాలు కనబరిచి ఆ బాలుర ప్రాణాలు కాపాడిన సంజయ్‌ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది.  దీంతో ఆ బాలుడికి  రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష బహుమతిని ప్రకటించింది. శుక్రవారం సీఎం ప్రమోద్‌ సావంత్‌ చెక్కును అందించి ప్రశంసించారు.

‘చిన్న వయసులో ధైర్యసాహలు ప్రదర్శించి తన స్నేహితులను కాపాడిన బాలుడిని కలవటం ఎంతో ఆనందంగా ఉంది. అంకుర్‌ సరైన సమయంలో తన సమయస్ఫూర్తితో తోటి పిల్లల జీవితాలను కాపాడాడు. అతని చూసి గోవా ఎంతో గర్విస్తోంది. అతని ప్రోత్సహించేందుకు రూ. లక్ష చెక్కును అందజేశాం. తనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను’ అని సీఎం ప్రమోద్‌ సావంత్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. దీంతో పాటు బాలుడుతో దిగిన ఫోటోను సీఎం సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. అటు ప్రతిపక్ష నేతలు, అధికారులు బాలుడిని ప్రశంసించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని