Eknath Shindhe: శిందే కేబినెట్‌లో 75% మంత్రులు నేరచరితులే.. అత్యంత ధనిక మంత్రి ఎవరంటే..?

మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేను గద్దె దించాక కొత్తగా ఏర్పాటైన భాజపా-శిందే (Eknath Shindhe) సారథ్యంలోని ప్రభుత్వంలో అత్యధిక మంది మంత్రులకు.....

Updated : 18 Aug 2022 16:34 IST

ముంబయి: మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రేను గద్దె దించాక కొత్తగా ఏర్పాటైన భాజపా-శిందే (Eknath Shindhe) సారథ్యంలోని ప్రభుత్వంలో అత్యధిక మంది మంత్రులకు నేరచరిత్ర (Criminal cases) ఉన్నట్టు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) వెల్లడించింది. ఈ నెల 9న తొలిసారి విస్తరించిన మంత్రివర్గంలో 75శాతం మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఈ విషయాన్ని 2019 ఎన్నికల సమయంలో వారే తమ ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా వెల్లడించారని తెలిపింది. శివసేనలో తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిణామాల నేపథ్యంలో ఏక్‌నాథ్‌ శిందే సీఎంగా, దేవేంద్ర ఫడణవీస్‌ డిప్యూటీ సీఎంగా జూన్‌ 30న ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చిన కేబినెట్‌ కూర్పు దాదాపు 40 రోజుల తర్వాత మూడు రోజుల క్రితమే కార్యరూపం దాల్చింది. అయితే, మొత్తంగా 20 మందితో కూడిన శిందే మంత్రివర్గంలో 15మంది (75శాతం మంది) మంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. అలాగే.. 13 (65శాతం) మంది మంత్రులపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్టు తెలిపింది.

మరోవైపు, శిందే కేబినెట్‌లో మంత్రులందరూ కోటీశ్వరులేనని.. వారి సగటు ఆస్తుల విలువ రూ.47.45 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. మలబార్‌హిల్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళ్‌ ప్రభాత్‌ లోధా అత్యంత ధనిక మంత్రి కాగా.. ఆయన ఆస్తుల విలువ రూ.441.65కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. అలాగే, పైథాన్‌ నియోజవకర్గానికి చెందిన భూమారే సందీపన్‌రావు ఆసారాం.. శిందే కేబినెట్‌లో తక్కువ ఆస్తి కలిగిన మంత్రి అని.. ఆయన ఆస్తి  విలువ 2.92కోట్లుగా ఉన్నట్టు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. అయితే, శిందే కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదని పేర్కొంది.

ఇకపోతే, కేబినెట్‌లో ఉన్న మంత్రుల విద్యార్హతల విషయానికి వస్తే.. ఎనిమిది మంది మంత్రులు 10, 12 తరగతుల వరకు చదివినవారు కాగా.. 11 మంది (55శాతం)  గ్రాడ్యుయేషన్‌, ఆ పై చదువులు చదివినవారు ఉన్నారని తెలిపింది. ఒక మంత్రి డిప్లమా చేశారని పేర్కొంది. ఇంకోవైపు, మంత్రుల వయసును పరిశీలిస్తే నలుగురు మంత్రులు 41 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన వారు కాగా.. మిగతా వారంతా 51 నుంచి 70 ఏళ్లు పైబడినవారే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని