Boy Stuck in Lift: లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి.. తాపీగా హోంవర్క్‌ చేసుకుంటూ..

Boy Stuck in Lift: లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఓ 8 ఏళ్ల బాలుడు భయపడలేదు సరికదా.. తాపీగా హోంవర్క్‌ రాస్తూ కన్పించాడు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగిందీ ఘటన.

Published : 21 Aug 2023 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సాధారణంగా మనం లిఫ్ట్‌ (Lift)లో ఇరుక్కున్నప్పడు ఒకింత ఆందోళనకు గురవుతాం. అదే చిన్నపిల్లలు చిక్కుకుపోతే తీవ్రంగా భయపడిపోతారు. ఏడుస్తారు. హరియాణా (Haryana)లోని ఫరీదాబాద్‌ (Faridabad) ఓ 8 ఏళ్ల బాలుడు కూడా అలాగే లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. అయితే, అతడు ఏడ్వలేదు.. కంగారుపడలేదు సరికదా తాపీగా కూర్చుని హోంవర్క్‌ రాస్తూ కన్పించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గ్రేటర్‌ ఫరీదాబాద్‌లోని సెక్టార్‌ 86లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో పవన్‌ చండీలా కుటుంబం నాలుగో అంతస్తులో నివాసముంటోంది. వీరి ఎనిమిదేళ్ల కుమారుడు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండే టీచర్‌ వద్ద ట్యూషన్‌కు వెళ్తుంటాడు. ట్యూషన్‌ వద్ద రోజూ బాలుడే తల్లే దిగబెడుతుండగా.. ఆదివారం సాయంత్రం ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో చిన్నారి ఒక్కడే బయల్దేరాడు.

అత్యాచారం వల్ల తల్లవడం.. కోలుకోలేని గాయమే: 27 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీం అనుమతి

కిందకు దిగేందుకు అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌ ఎక్కగా.. ఉన్నట్టుండి రెండో అంతస్తులో అది ఆగిపోయింది. తొలుత కాస్త కంగారుపడిన బాలుడు.. లిఫ్ట్‌ డోర్ వద్ద నిలబడి సాయం కోసం అరిచాడు. కానీ, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో బాలుడిని గమనించలేదు. కొంతసేపు వేచి చూసిన ఆ చిన్నారి చేసేదేం లేక.. బ్యాగు తెరిచి అక్కడే హోంవర్క్‌ చేసుకున్నాడు.

గంటైనా చిన్నారి ట్యూషన్‌కు రాకపోవడంతో టీచర్‌.. వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురై సొసైటీ అంతా వెతికారు. అయినా ఎక్కడా కన్పించకపోవడంతో అనుమానం వచ్చి లిఫ్ట్‌ వద్దకు వెళ్లారు. చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినట్లు తెలుసుకుని వెంటనే లిఫ్ట్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు. లిఫ్ట్‌కు మరమ్మతు చేసిన అనంతరం తీరా డోర్‌ తెరిచి చూడగా బాలుడు తాపీగా హోంవర్క్‌ రాసుకుంటూ కన్పించాడు. దాదాపు రెండు గంటల తర్వాత చిన్నారి లిఫ్ట్‌ నుంచి బయటకు రాగలిగాడు. అతడు క్షేమంగానే ఉన్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని