Jayalalithaa: జయలలితకు అవమానంపై.. తమిళనాట మాటల యుధ్ధం

1989లో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలితను అవమానించారంటూ నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఖండించింది.

Published : 13 Aug 2023 16:43 IST

చెన్నై: గతంలో తమిళనాడు అసెంబ్లీలో దివంగత జయలలితకు అవమానం జరిగిందని (Jayalalithaa assault) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం స్టాలిన్‌ (MK Stalin) మాట్లాడుతూ.. దాడి జరగడం వాస్తవం కాదని, జయలలిత నటించారన్న విషయం ఆనాడు సభలో ఉన్న ప్రతిఒక్కరికీ తెలుసన్నారు.

ఇదే విషయంపై డీఎంకే కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వాట్సాప్‌ హిస్టరీ’ ఆధారంగా నిర్మలా సీతారామన్‌ ఏదో విషయం చెప్పారని పేర్కొంది. తమిళనాడు శాసనసభలో జయలలితకు అటువంటి అవమానం జరగలేదని తెలిపింది. అన్నాడీఎంకే మాజీ నేత, ప్రస్తుత కాంగ్రెస్‌ ఎంపీ తిరువనవుక్కరసార్‌ కూడా.. జయలలిత రిహార్సల్స్‌ చేశారని ఆరోపించారు.

మీరు జయలలితను అవమానించిన విషయం మర్చిపోయినట్లున్నారు : నిర్మలా సీతారామన్‌

కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రశ్నించడంపై అన్నాడీఎంకే నేత పళనిస్వామి (Palaniswami) వెంటనే స్పందించారు. జయలలితపై (Jayalalithaa) దాడి జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని.. అప్పటి దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలోనే అది జరిగిందన్నారు. ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా చెబుతున్నానని.. సీఎం సమక్షంలోనే జరిగిన ఆ దాడి పథకం ప్రకారమే చేశారని ఆరోపించారు. డీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు ‘అమ్మ’ (జయలలిత)పై దాడి చేశారని, ఇప్పుడు సీనియర్‌ మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి జయలలితను అవమానించారని అన్నారు. అసెంబ్లీ చరిత్రలోనే అదో చీకటి రోజు అని పేర్కొన్నారు.

అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 10న లోక్‌సభలో చర్చ జరిగింది. మణిపుర్‌ అంశంపై మాట్లాడిన నిర్మలా సీతారామన్‌.. 1989లో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత చీరను కొందరు సభ్యులు లాగారని డీఎంకే ఎంపీ కనిమొళికి గుర్తుచేశారు. ‘పవిత్రమైన సభలో.. ప్రతిపక్ష నేత జయలలిత చీరను లాగారు. దాన్ని చూసి అక్కడ కూర్చున్న డీఎంకే సభ్యులు ఆమెను ఎగతాళి చేశారు. నవ్వుతూ ఆమెపై జోకులు వేశారు. రెండేళ్ల తర్వాత తమిళనాడు సీఎంగా ఆమె తిరిగివచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్న వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు’ అని సీతారామన్‌ విమర్శలు గుప్పించారు. ఇటీవల పార్లమెంటులో నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని