Yoga: తొమ్మిదేళ్ల వయసులోనే యోగా గురువుగా బుడతడు.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం

తొమ్మిదేళ్ల వయసులో ఓ బుడతడు యోగా గురువుగా మారిపోయాడు. అతి పిన్న వయసు యోగా గురువుగా అతడిని గుర్తిస్తూ ప్రతిష్ఠాత్మక గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో......

Published : 21 Feb 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తొమ్మిదేళ్ల వయసులో ఓ బుడతడు యోగా గురువుగా మారిపోయాడు. అతి పిన్న వయసు యోగా గురువుగా అతడిని గుర్తిస్తూ ప్రతిష్ఠాత్మక గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో అతడికి స్థానం కల్పించింది. భారత్‌కు చెందిన తొమ్మిదేళ్ల రేయాన్ష్‌ సురాని కుటుంబం ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. నాలుగేళ్ల వయసు నుంచే రేయాన్ష్‌ తల్లిదండ్రులతో కలిసి భారత్‌లోని రిషికేశ్‌లో యోగా సాధన మొదలుపెట్టాడు. 200 గంటల యోగా టీచర్స్‌ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన రేయాన్ష్‌..  గతేడాది జులై 27న ఆనంద్‌ శేఖర్ యోగా పాఠశాల నుంచి యోగా గురువు ధ్రువపత్రాన్ని అందుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

కోర్సు సమయంలో రేయాన్ష్ యోగాకు సంబంధించి అనేక మెలకువలను నేర్చుకున్నాడు. యోగాలోని ‘అలైన్‌మెంట్, అనాటమిక్ ఫిలాసఫీ, ఆయుర్వేదంలోని వాస్తవాలు’ వంటి అనేక అంశాలను నేర్చుకున్నాడు. రేయాన్ష్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యోగా పట్ల నాకున్న అభిప్రాయాన్ని ఈ కోర్సు మార్చేసింది. యోగా అనేది శారీరక భంగిమలు, శ్వాస గురించి మాత్రమే అనుకున్నాను. కానీ అది దాని కంటే చాలా ఎక్కువ అని గ్రహించా’ అని తెలిపాడు. ప్రస్తుతం అతడు పెద్దలతోపాటు పిల్లలకు కూడా యోగా నేర్పిస్తున్నాడు.

రానున్న రోజుల్లో వర్చువల్‌ రియాలిటీ తరగతులు నిర్వహిస్తానని బాలుడు పేర్కొంటున్నాడు. కరోనా నిబంధనల కారణంగా కొద్ద మందికే శిక్షణ అందిస్తున్నానని, పాఠశాలలోనూ ప్రతి సెషన్‌లో 10-15 మంది పిల్లలకు యోగా మెలకువలు నేర్పిస్తున్నట్లు తెలిపాడు. గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించడంపై రేయాన్ష్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ‘నాకు నేను ఇప్పుడు ఓ స్టార్‌లో కనిపిస్తున్నా’ అని సంబురపడ్డాడు. రేయాన్ష్ యోగా సాధన చేస్తున్న ఓ యూట్యూబ్ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని