కొవాగ్జిన్‌ తొలి దశ ట్రయల్స్‌ పూర్తి:ICMR

భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా తొలి దశ ట్రయల్స్‌ పూర్తయిందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. భారత్‌ బయోటెక్‌తో......

Published : 04 Aug 2020 18:06 IST

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా తొలి దశ ట్రయల్స్‌ పూర్తయిందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. భారత్‌ బయోటెక్‌తో పాటు జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ కూడా తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్నట్టు ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ తెలిపారు. రెండో దశ ట్రయల్స్‌కు ఇరు సంస్థల వ్యాక్సిన్లు సిద్ధమైనట్టు చెప్పారు. రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయని తెలిపారు. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా-పుణెతో కలిసి తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ రెండు, మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. వారం రోజుల్లో 17 ప్రదేశాల్లో  ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయన్నారు. భౌతికదూరం పాటించడమే ఇప్పటివరకు కరోనాకు ఉత్తమ వ్యాక్సిన్‌ అని చెప్పారు.

మరణాల రేటు తగ్గడం శుభసూచికం

మరోవైపు, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2కోట్లకు పైగా కొవిడ్‌పరీక్షలు జరిగాయి. గడిచిన 24గంటల్లోనే 6.6లక్షల పరీక్షలు నిర్వహించినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో యాక్టివ్‌ కేసుల కన్నా రికవరీ అయినవారే రెట్టింపు అని తెలిపారు. దేశంలో తొలి లాక్‌డౌన్‌ విధించినప్పటి కంటే తొలిసారి మరణాల రేటు తక్కువగా (2.1శాతం) ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ వెల్లడించారు. గతంతో పోలిస్తే చాలా రాష్ట్రాలు తమ టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నాయన్నారు. ఆర్‌టీ పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి మిలియన్‌ జనాభాకు 140కంటే ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నాయని తెలిపారు. గోవా, దిల్లీ, త్రిపుర, తమిళనాడు రాష్ట్రాలు తమ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకున్నాయని తెలిపారు. దేశంలో మరణాల రేటు మరణాల రేటు తగ్గుతుండటం శుభసూచికమన్నారు. 

మృతుల్లో 68శాతం పురుషులే..

దేశంలో నమోదైన కొవిడ్‌ మరణాల్లో 50శాతం మంది 60 ఏళ్లు పైబడినవారేనని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. 37శాతం మంది 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు కాగా.. 11శాతం 26 నుంచి 44 ఏళ్ల లోపు ఉన్నవారేనని తెలిపారు. అలాగే,  ఏడేళ్ల లోపు వారు 1శాతం కాగా.. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు కలిగినవారు 1శాతంగా ఉన్నట్టు ఆయన వివరించారు. మొత్తం మరణాల్లో 68శాతం పురుషులు కాగా.. 32శాతం మహిళలు ఉన్నారన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని