రికవరీ భారత్‌: కేసుల రెట్టింపునకు 73రోజులు!

ఆగస్టు నెలలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 25రోజుల సమయం పడితే ప్రస్తుతం అది 73రోజులకు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.

Published : 15 Oct 2020 15:24 IST

87శాతం దాటిన రికవరీ రేటు, 9కోట్ల టెస్టులు పూర్తి

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం, కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి ఎక్కువ సమయం పట్టడం ఊరటనిస్తోంది. ఆగస్టు నెలలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి (డబ్లింగ్‌) 25రోజుల సమయం పడితే ప్రస్తుతం అది 73రోజులకు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. స్వల్ప కాలంలోనే 25రోజుల నుంచి 73రోజులకు పెరగడం వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సూచికగా ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా రోజువారీ మరణాల సంఖ్య 1100 నుంచి 600లకు తగ్గడం కూడా ఉపశమనం కలిగించే అంశం.

గతకొన్ని రోజులుగా దేశంలో నిత్యం నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్న వారిసంఖ్య అధికంగా ఉంటోంది. గడిచిన 24గంటల్లో 81,514 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ నుంచి కోలుకున్న వారిసంఖ్య 64లక్షలకు చేరింది. దాదాపు 79శాతం రికవరీ కేసులు పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని..దీంతో దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 87శాతం దాటినట్లు కేంద్రం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ టెస్టుల సంఖ్యను భారీగా చేపట్టడం, ట్రాకింగ్‌ ద్వారా వైరస్‌సోకిన వారిని సమర్థవంతంగా గుర్తించడంతోపాటు మెరుగైన చికిత్స అందించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపింది. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు వైరస్‌ పోరులో ముందున్న అన్ని విభాగాల సమన్వయంతోనే ఈ ఫలితాలు సాధ్యమైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 73,07,097కు చేరగా వీరిలో 1,11,266 మంది ప్రాణాలు కోల్పోయారు.

9కోట్లు దాటిన టెస్టులు..

ఇక కరోనా వైరస్‌ పరీక్షలను కూడా భారీగానే చేపడుతున్నారు. నిత్యం పదిలక్షలకుపైగా టెస్టులు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 11లక్షల 36వేల కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ ప్రకటించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 9కోట్ల 12లక్షల కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు వెల్లడించింది. దేశంలో ర్యాపిడ్ టెస్టులతోపాటు 1944ల్యాబ్‌ల ద్వారా కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో 12కోట్ల కొవిడ్‌ టెస్టులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, తొమ్మిది కోట్లతో భారత్‌ రెండో స్థానంలో కొనసాతున్నాయి. ఇక చైనాలో ఇప్పటివరకు 16కోట్ల టెస్టులు చేసినట్లు నివేదికలు ఉన్నప్పటికీ చైనా మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని