ఎన్నికల రాష్ట్రాల్లో ₹వెయ్యి కోట్లు సీజ్‌!

ఎన్నికల్లో ఓట్లకోసం ప్రలోభాల పర్వం ఏ స్థాయిలో జరుగుతుందో నిరూపించే తిరుగులేని సాక్ష్యమిది..! ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు ధనం, మద్యం ప్రవాహాన్ని....

Published : 17 Apr 2021 01:48 IST

వివరాలు వెల్లడించిన ఈసీ

దిల్లీ: ఎన్నికల్లో ఓట్లకోసం ప్రలోభాల పర్వం ఏ స్థాయిలో జరుగుతుందో నిరూపించే తిరుగులేని సాక్ష్యమిది..! ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు ధనం, మద్యం ప్రవాహాన్ని ఎలా కొనసాగిస్తాయో చెప్పేందుకు ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2016లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇది ఊహించని విధంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2016 ఎన్నికల్లో సీజ్‌ చేసిన మొత్తాన్ని సరిపోలుస్తూ ప్రత్యేక గ్రాఫ్‌లను విడుదల చేసింది. 

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోంలలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే ముగియగా.. బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం రోజున ఐదో విడత పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 15వరకు సీజ్‌ చేసిన నగదు, ఇతర సామగ్రి వివరాలను ఈసీ విడుదల చేసింది. తమిళనాడులో అత్యధికంగా రూ.236.69 కోట్లు నగదు స్వాధీనం చేసుకోగా..  ఆ తర్వాత బెంగాల్‌లో రూ.50.71 కోట్లు, అసోంలో రూ.27.09కోట్లు, కేరళలో రూ.22.88కోట్లు, పుదుచ్చేరిలో రూ.5.52కోట్ల మేర నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.

ఇకపోతే,  బెంగాల్‌లో రూ.118 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోగా.. అసోంలో రూ.34కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అలాగే, అసోంలో రూ.41 కోట్ల విలువ చేసే మద్యాన్ని.. బెంగాల్‌లో రూ.30 కోట్ల విలువైన మద్యాన్ని.. తమిళనాడులో రూ.176 కోట్లు విలువచేసే ఆభరణాలు స్వాధీనం చేసుకోగా.. కేరళలో రూ.50 కోట్లు, పుదుర్చేరిలో రూ.27కోట్ల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా కానుకల విషయానికి వస్తే బెంగాల్‌లో రూ.88 కోట్ల విలువ చేసే గిఫ్ట్‌లను అధికారులు స్వాధీనం చేసుకోగా.. తమిళనాడులో రూ.25 కోట్లు, అసోంలో రూ.15కోట్ల విలువైన గిఫ్ట్‌లను పట్టుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2016లో జరిగిన ఎన్నికల్లో రూ. 225.77 కోట్లు మాత్రమే సీజ్‌ చేసినట్టు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని