ఇక ‘లాలాజలం’తో కొవిడ్‌ టెస్టులు!

లాలాజలంతో కొవిడ్‌ నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated : 16 Aug 2020 17:16 IST

‘సలైవాడైరెక్ట్‌’ విధానానికి FDA అనుమతి
మరింత సులభతరం కానున్న కొవిడ్‌ నిర్ధారణ
కొవిడ్‌ టెస్టుల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ అంటున్న నిపుణులు

హూస్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని వీలైనంత త్వరగా గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. వేగంగా, కచ్చితత్వంతో కూడిన వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా తాజాగా లాలాజలంతో కొవిడ్‌ నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచడంతోపాటు కొవిడ్‌ టెస్టు ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం ప్రపంచవ్యాప్తంగా గొంతు, ముక్కు ద్వారా నమూనాలు(స్వాబ్‌) సేకరిస్తున్నారు. ఇవి సేకరించే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి రావడం, నమూనాలు భద్రపరచడం, ఫలితానికి సమయం, ఖర్చు వంటి సవాళ్లు ఎదురౌతున్నాయి. అంతేకాకుండా శాంపిళ్ల సేకరణ కూడా అత్యంత జాగ్రత్తగా తీసుకోవడం మరో కీలకాంశం. వీటిని అధిగమించే నూతన విధానానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది. తాజాగా ఎఫ్‌డీఏ ఆమోదించిన సలైవా టెస్ట్‌ పద్ధతిలో నోటినుంచి లాలాజలాన్ని తీసుకొని పరీక్షిస్తారు. ఈ విధానం వల్ల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడంతోపాటు పరీక్షల్లో కీలకమైన రియేజెంట్ల లోటును భర్తీ చేయవచ్చని ఎఫ్‌డీఏ కమిషనర్‌ స్టీఫెన్‌ హాన్‌ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే లాలాజలంతో పరీక్షించే నాలుగు రకాల పద్ధతులకు ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. అయితే వాటి ఫలితాల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ‘సలైవాడెరెక్ట్‌’ పేరుతో యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నిపుణులు అభివృద్ధి చేసిన ఈ విధానంతో స్వాబ్‌ పరీక్షలకు సమాన ఫలితాలు ఉన్నట్లు గుర్తించామని ఎఫ్‌డీఏ పేర్కొంది. అత్యవసర వినియోగంలో భాగంగా ఈ నూతన పద్ధతికి అనుమతి ఇస్తున్నట్లు ఎఫ్‌డీఏ ప్రకటించింది. వచ్చే కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకులు పేర్కొన్నారు. స్వాబ్‌ ద్వారా తీసుకొనే నమూనాల కంటే ఈ నూతన పద్ధతిలో తక్కువ హాని ఉంటుందని, దాదాపు 90శాతం కచ్చితమైన ఫలితం వస్తున్నట్లు నిపుణులు తెలిపారు.

అత్యంత తేలికగా నమూనాలు సేకరించి, పరీక్షించే ఈ విధానం రానున్న రోజుల్లో కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణలో ‘గేమ్‌ ఛేంజర్’‌గా మారే అవకాశాలున్నాయని సలైవాడెరెక్ట్‌ అభివృద్ధిలో భాగమైన పరిశోధకులు నాధాన్‌ గ్రూబౌగ్‌, అన్నే వైల్లీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా మిగతా పద్ధతులతో పోల్చితే చాలా తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన ఈ నూతన విధానాన్ని అంతర్జాతీయ ఆరోగ్యరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు.

ఎన్నో ప్రయోజనాలు..
*శాంపిల్‌ తీసుకోవడం సురక్షితం, తక్కువ హాని..
*ఆరోగ్య సిబ్బందికి స్పల్ప శిక్షణ, శాంపిల్‌ సేకరించే సమయంలో తక్కువ ప్రమాదం
*ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరించే సమయంలో తుమ్ము, దగ్గు వలన వైరస్‌ మరింత బయటకు వస్తుంది. దీనిలో అలాంటి అవకాశాలు లేకపోవడం 
*అనుమానిత వ్యక్తులే సొంతంగా శాంపిల్‌ సేకరించి ఇవ్వడం
*కనిష్ఠ ఉష్ణోగ్రతలలో శాంపిళ్లను ప్రత్యేకంగా భద్రతపరిచే అవసరం లేకపోవడం
* స్వాబ్‌ పద్ధతితో పోల్చితే తక్కువ ఖర్చు, దాదాపు 90శాతం కచ్చితమైన ఫలితం ఉండటం

ఇదిలా ఉంటే, కొవిడ్‌-19ను నిర్ధారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం స్వాబ్‌ పద్ధతినే అవలంభిస్తున్నారు. భారత్‌ వంటి దేశాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌తోపాటు ట్రూనాట్‌, సీబీనాట్‌ విధానాల ద్వారా కూడా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని