Twitter: ట్విటర్‌పై కేంద్రం కొరడా

నూతన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు పాటించనందుకు ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ‘సురక్షిత ఆశ్రయం’(సేఫ్‌ హార్బర్‌) అన్న రక్షణ కవచాన్ని ఆ సామాజిక మాధ్యమం కోల్పోయింది. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చర్యలు తీసుకొనే వీలు కలుగుతుంది.

Updated : 17 Jun 2021 13:03 IST

‘సురక్షిత ఆశ్రయం’ హోదా తొలగింపు

కొత్త నిబంధనలు పాటించలేదంటూ చర్యలు

దిల్లీ: నూతన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు పాటించనందుకు ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ‘సురక్షిత ఆశ్రయం’(సేఫ్‌ హార్బర్‌) అన్న రక్షణ కవచాన్ని ఆ సామాజిక మాధ్యమం కోల్పోయింది. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చర్యలు తీసుకొనే వీలు కలుగుతుంది. కొత్త నిబంధనలను తప్పకుండా పాటించాలంటూ మే 26న కేంద్ర ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. లేకుంటే ఐటీ చట్టం కింద లభించే అన్ని మినహాయింపులు రద్దవుతాయని హెచ్చరించింది. అయినా వీటిని అమలు చేయకపోవడంతో ట్విటర్‌కు ఇచ్చిన ‘సురక్షిత ఆశ్రయం’ అన్న హోదాను తొలగించింది. దాంతో ఎవరు ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టు పెట్టినా ఇకపై ట్విటర్‌ కూడా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం...సమస్యల పరిష్కారానికి ‘రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌’, ‘నోడల్‌ కాంట్రాక్ట్‌ పర్సన్‌’లను నియమించినట్టు ట్విటర్‌ సమాచారం పంపించింది. అయితే వారెవరూ ఆ సంస్థ ఉద్యోగులు కారు. నిబంధనల ప్రకారం ‘చీఫ్‌ కంప్లియన్స్‌ ఆఫీసర్‌’ను నియమించాల్సి ఉండగా, ఆ వ్యక్తి పేరు, ఇతర సమాచారం ఏదీ ఇంతవరకు ప్రభుత్వానికి అందజేయలేదు. దాంతో కొన్ని చట్టపరమైన విషయాల్లో ట్విటర్‌కు ఇచ్చిన మినహాయింపులు మే 26నే వాటంతట అవే రద్దయ్యాయి. ఒక్క ట్విటర్‌కే కాకుండా ఇతర సామాజిక మాధ్యమాలకూ ఇదే వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. చట్టం ప్రకారం ‘గ్రీవెన్స్‌ ఆఫీసర్‌’, ‘నోడల్‌ ఆఫీసర్‌’, ‘చీఫ్‌ కంప్లియన్స్‌ ఆఫీసర్‌’లను నియమించాల్సి ఉంది. వారంతా భారతదేశానికి చెందిన వారే అయి ఉండాలి.

ట్విటర్‌ ఎండీని విచారించిన దిల్లీ పోలీసులు

ఈనాడు, దిల్లీ: భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ట్వీట్‌పై ‘వక్రీకరించిన సమాచారం’ (మ్యానిపులేటెడ్‌ మీడియా) అని ముద్రవేయడంపై దిల్లీ పోలీసులు ట్విటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను విచారించారు. దిల్లీకి చెందిన ఉన్నతాధికారుల బృందం గత నెల 31న బెంగళూరు వెళ్లి అక్కడ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహేశ్వరితో సంభాషించారు. అంతకుముందు మూడు ఈ-మెయిళ్లు పంపినప్పటికీ సరయిన సమాధానాలు ఇవ్వకపోవడంతో పోలీసులు స్వయంగా వెళ్లారు. నిజానికి మనీశ్‌ సేల్స్‌ విభాగం అధిపతి అయినప్పటికీ మేనేజింగ్‌ డైరెక్టర్‌నని చెప్పుకుంటున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ట్వటర్‌ భారత్‌ అనుబంధ సంస్థ అయిన టీసీఐపీఎల్‌కు చెందిన డైరెక్టర్ల వివరాలు కూడా తనకు తెలియవని ఆయన చెప్పారు. దాంతో మీరు ఎవరికైనా జవాబుదారీగా ఉంటారా అని పోలీసులు ప్రశ్నించగా సింగపూర్‌లోని యు ససమోటోకు రిపోర్టు చేస్తుంటానని తెలిపారు. అయితే ససమోటోకు భారత్‌ వ్యవహారాలతో సంబంధం లేదని; జపాన్‌, దక్షిణ కొరియా, అసియా పసిఫిక్‌ వ్యవహారాలు చూస్తుంటారని తెలిపింది. ట్విటర్‌కు, టీసీఐపీఎల్‌కు ఉన్న సంబంధంపై స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. అయితే భారత చట్టాలను ఉల్లంఘించడానికే ట్విటర్‌కు, టీసీఐపీఎల్‌కు సంబంధం లేదని అంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్విటర్‌తో సంబంధం లేకపోతే తన ఈ-మెయిల్‌లో జ్మీ‌్రi్మ్మ’౯  అని ఎందుకు ఉందని, జ్మీ‘i్పః అని ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. కరోనా నివారణలో విఫలమయిందంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కాంగ్రెస్‌ టూల్‌కిట్‌ రూపొందించిందంటూ సంబిత్‌ పాత్ర ట్వీట్‌ చేశారు. దీనికే ట్విటర్‌ మ్యానిపులేటెడ్‌ మీడియా అని జత చేసింది. దీనిపైనే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

కావాలనే పాటించడం లేదు
కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ బుధవారం ఇక్కడ మాట్లాడుతూ ట్విటర్‌ సంస్థ కావాలనే నూతన నిబంధనలను పాటించడం లేదని అన్నారు. భావ స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకొనే ఆ సంస్థ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా తనకు ఇష్టం వచ్చినప్పుడు కొందరి పోస్టులకు ‘వక్రీకరించిన మీడియా’ అన్న ముద్ర వేస్తోందని విమర్శించారు. ఇతర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ కంపెనీలు అక్కడి నిబంధనలు అమలు చేస్తాయని, కానీ ట్విటర్‌ మాత్రం ఇక్కడ చట్టాలను పాటించడం లేదని అన్నారు. దీనిపై ట్విటర్‌ను సంప్రదించగా, స్పందించలేదు.

యూపీలో కేసు నమోదు
తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారన్న కారణంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ట్విటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పోస్టును ఇతరులకు పంపించారంటూ పాత్రికేయులు, కాంగ్రెస్‌ నాయకులు సహా ఆరుగురిపైనా కేసు పెట్టారు. తనపై కొందరు దాడి చేశారంటూ ఓ వృద్ధుడు చెప్పిన విషయం ట్విటర్‌లో వచ్చింది. అయితే ఇది మత కలహాలు ప్రేరేపించేదిగా ఉందంటూ యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని