నేడు రాజ్‌నాథ్‌తో చైనా రక్షణ మంత్రి భేటీ?

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీ నేడు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన వారు నేడు సాయంత్రం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది........

Published : 04 Sep 2020 15:00 IST

దిల్లీ: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీ నేడు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన వారు నేడు సాయంత్రం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ భేటీ జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే నెలలో తొలిసారి లద్దాఖ్‌లో సైనిక ఘర్షణ చోటుచేసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. గతంలో ఓ సారి విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో ఫోన్‌లో సంభాషించారు. 
సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయన్న ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణె వ్యాఖ్యల నేపథ్యంలో తాజా భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గల్వాన్‌ ఘర్షణ అనంతరం ఉభయ దేశాలు కలిసి తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయడంలో చైనా విఫలమైంది. పూర్తి స్థాయిలో సైన్యాన్ని ఉపసంహరించుకోకపోగా.. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా జరగబోయే భేటీలో ఏం నిర్ణయిస్తారన్నది ఆసక్తిగా మారింది. 

సమావేశం కావాలని తొలుత చైనా మంత్రే ఆసక్తి వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు భారత ప్రతినిధులకు భేటీ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనికి దిల్లీ అనుమతి లభించడంతో ఉద్రిక్తతలు సద్దుమణిచే దిశగా చర్చలు జరిపేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవులో దురాక్రమణకు పాల్పడేందుకు చైనా వేసిన ఎత్తులను భారత్‌ తన పైఎత్తులతో చిత్తు చేసింది. ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని చైనాను ఇరకాటంలోకి నెట్టింది. దీంతో చర్చల్లో పై చేయి సాధించాలన్న భారత్‌ వ్యూహం ఫలించినట్లైంది. కీలక ప్రాంతాలన్నీ భారత్‌ చేతిలో ఉండడంతో చేసేది లేక చైనాయే ముందుగా చర్చలకు ప్రతిపాదించినట్లు అర్థమవుతోంది.

ఇవీ చదవండి..
చైనా ఎత్తులకు భారత్‌ పైఎత్తు!
దిగొస్తున్న చైనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు