రష్యా వ్యాక్సిన్‌తో యాంటీబాడీస్‌ ఉత్పత్తి

రష్యా తీసుకొచ్చిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘స్నుత్నిక్‌-వి’తో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌..........

Published : 04 Sep 2020 19:23 IST

లాన్సెట్‌ జర్నల్‌లో వెల్లడి
విమర్శలకు సమాధానం దొరికిందన్న రష్యా

మాస్కో: రష్యా తీసుకొచ్చిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’తో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ వెల్లడించింది. తొలి రెండు దశల మానవ ప్రయోగాల్లో పాల్గొన్న అందరిలోనూ ఇవి ఉత్పత్తి అయినట్లు పేర్కొంది. శుక్రవారం విడుదలైన ఈ జర్నల్‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జూన్‌-జులై నెలల్లో రెండు దశల్లో 38 మంది చొప్పున మొత్తం 76 మందికి వ్యాక్సిన్‌ అందించారు. వారందరిలోనూ నూరు శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు లాన్సెట్‌ పేర్కొంది. ఎవరీలోనూ ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని పేర్కొంది. వ్యాక్సిన్‌ను దీర్ఘకాలంలో భద్రంగా, మరింత ప్రభావంతంగా తీర్చిదిద్దేందుకు పెద్దఎత్తున పరీక్షలు, మరింత పర్యవేక్షణ అవసరం అని అభిప్రాయపడింది.

ప్రపంచంలో అందరి కంటే కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ కనుగొన్న దేశంగా రష్యా ప్రకటించుకున్నప్పటికీ.. వ్యాక్సిన్‌పై పలు దేశాలు, వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ కుమార్తెకు సైతం వ్యాక్సిన్‌ ఇచ్చినప్పటికీ.. తొలి రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారమూ పంచుకోకపోవడంతో రష్యా విమర్శలు ఎదుర్కొంది. లాన్సెట్‌ ప్రచురణతో తమ చేతికి ఆయుధం దొరికిందని రష్యన్‌ డైరెక్టర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధినేత కిరిల్‌ దిమిత్రియేవ్‌ అన్నారు. రష్యా వ్యాక్సిన్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన వారికి సమాధానం ఇచ్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇతర దేశాల వ్యాక్సిన్ల పనితీరును ఇప్పుడు తాము ప్రశ్నిస్తామని చెప్పారు. మరోవైపు వ్యాక్సిన్‌కు సంబంధించి మలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించిన రష్యా.. ఏడాది చివరి నాటికి నెలకు 15 లక్షల నుంచి 20 లక్షల డోసులను సిద్ధం చేయగలమని భావిస్తోంది. క్రమంగా నెలకు దాన్ని 60 లక్షలకు పెంచుకోగలమన్న విశ్వాసం వ్యక్తంచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని