భర్తతో విడిపోయిన మహిళలకు ఊరట

జీవిత భాగస్వామితో తెగతెంపులు చేసుకున్న మహిళకు అత్తవారింట్లో నివసించే హక్కు ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Updated : 17 Oct 2020 13:19 IST

దిల్లీ: భర్త నుంచి విడిపోయిన మహిళలకు సంబంధించిన హక్కుల గురించి సుప్రీం కోర్టు ఓ కీలక తీర్పును వెల్లడించింది. తన జీవిత భాగస్వామితో కలిసి జీవించకుండా దూరంగా ఉంటున్న మహిళకు అత్తవారింట్లో నివసించే హక్కు ఉందని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2019లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సతీష్ చందర్ అహుజా అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీలును.. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్.సుభాష్ రెడ్డి, ఎం.ఆర్.షాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

కుమారుడికే హక్కు లేనప్పుడు కోడలికెలా..

రవీన్ అహుజా అనే వ్యక్తి, ఆయన భార్య స్నేహ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్నేహ అహుజా కూడా తన అత్తవారింట్లోనే ఉంటోంది. కాగా విడాకులకు దరఖాస్తు చేసిన తమ కోడలు ఇంట్లో ఉండరాదంటూ రవీన్‌ తండ్రి సతీష్ అహుజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో దిల్లీ హైకోర్టు సదరు యువతి అత్తారింట్లో ఉండేందుకు అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, ఈ తీర్పును సతీష్ చందర్‌ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఆ ఇల్లు తన స్వార్జితమని.. ఇందులో తన కుమారుడికే హక్కు లేనప్పుడు.. కోడలికి ఏ విధంగా ఉండే హక్కు లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.

పలు పాత్రలు పోషిస్తున్నా వివక్షే..

కాగా ఈ వాదనను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. స్నేహ, రవీన్‌ల విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ఆమెకు తన అత్తవారింట్లో ఉండే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. దేశంలో గృహ హింస ప్రబలంగా ఉందని.. రోజూ మహిళలు ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం పేర్కొంది. జీవితకాలమంతా కుమార్తె, సోదరి, భార్య, తల్లి, భాగస్వామి ఇలా పలు రకాల పాత్రలను పోషించే మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా సుప్రీం అభిప్రాయపడింది. గృహ హింస చట్టం ప్రకారం.. మహిళలు భర్తతో కలిసి ఉండనప్పటికీ అత్తవారింట్లో నివసించే హక్కు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని