తమిళనాట ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ 

కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరిన్ని సడలింపులతో రాష్ట్ర వ్యాప్తంగా .....

Published : 30 Jul 2020 16:30 IST

సీఎం పళనిస్వామి ప్రకటన

చెన్నై: కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరిన్ని సడలింపులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఆగస్టు నెలలోని అన్ని ఆదివారాల్లోనూ (2, 9, 16, 23, 30 తేదీల్లో) కఠినమైన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు సీఎం పళనిస్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని కమర్షియల్‌, ప్రైవేటు సంస్థల్లో శ్రామిక శక్తిని 75శాతం పెంచుకొనేందుకు వీలు కల్పించడంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో భోజన సర్వీసులను అందించేందుకు అనుమతులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు పలు జాగ్రత్తలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. 

జిల్లా కలెక్టర్లు, వైద్య నిపుణులు, సీనియర్‌ మంత్రులు సలహాలు, సూచనలను ఆధారంగా చేసుకొని లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. కంటైన్‌మెంట్‌జోన్లలో మాత్రం అన్ని నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. మతపరమైన సమావేశాలు, ప్రజారవాణా, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు, బార్లు, రాజకీయ, క్రీడా సంబంధమైన కార్యకలాపాలపై నిషేధం యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.  

మరోవైపు, తమిళనాడులో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 6,426 కొత్త కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 2,34,114కి పెరిగింది. వీరిలో 1,72,883 మంది డిశ్చార్జి కాగా..3,741మంది మృత్యువాతపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని