
Tips: టిప్పు దోచేయడం తప్పు.. త్వరలో యూకే చట్టం
లండన్: ‘నగదు మారకం వద్దు.. ఈ-కామర్స్ (ఆన్లైన్ చెల్లింపులు) ముద్దు’ అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం బ్రిటన్‌లో కార్మికుల కడుపు కొడుతోంది. దేశంలో 80 శాతం బిల్లులు కార్డుల ద్వారానే (టిప్పుతో కలిపి) చెల్లిస్తున్నారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్బుల యజమానులు చాలామంది ఈ టిప్పులను తిరిగి కార్మికులకు ఇవ్వడం లేదని ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. దేశ ఆతిథ్యరంగం దెబ్బతినకుండా ఈ దోపిడీని అరికట్టేందుకు త్వరలో చట్టం తీసుకురానున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటన చేసింది. ఈ రంగంలో కనీస వేతనాలతో పనిచేసే కార్మికులు వారి సేవలను మెచ్చి వినియోగదారులు ఇచ్చే టిప్పులపై ఎంతో ఆశతో ఉంటారని అందులో పేర్కొంది. ‘కొన్ని కంపెనీలు అనుసరిస్తున్న ఈ వైఖరి దురదృష్టకరం. మేం తీసుకురానున్న చట్టంతో కష్టపడే కార్మికులకు న్యాయం జరుగుతుంది’ అని యూకే కార్మికశాఖ మంత్రి పాల్ స్కల్లి తెలిపారు. దేశంలోని 1,90,000 వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న 20 లక్షల కార్మికులు కొత్త చట్టంతో లబ్ధి పొందుతారు. యజమానులు చట్టాన్ని అతిక్రమిస్తే.. ఉపాధి కోర్టుల్లో సవాలు చేసి కార్మికులు పరిహారం పొందవచ్చని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.