Updated : 09/12/2021 12:58 IST

bipin rawat: వీవీఐపీ ప్రమాదాలకూ కేరాఫ్‌గా ఎంఐ-17..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

అత్యంత సురక్షితమైంది.. దృఢమైన నిర్మాణం.. భారీగా పేలోడ్‌ను తరలించగలదు.. దాడులను సమర్థంగా తట్టుకోగలదు.. రెండు ఇంజిన్లు.. ఇలాంటి భుజకీర్తులు ఎంఐ-17 హెలికాప్టర్‌కు చాలా ఉన్నాయి. ఎంఐ-17వీ5కూడా ఎంఐ-17 సిరీస్‌లో ఓ వేరియంట్‌ మాత్రమే. రష్యా, చైనా, అమెరికా, భారత్‌, దక్షిణ కొరియా సహా ప్రపంచంలోని 70కిపైగా దేశాలు ఈ హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌లో ఆపరేషన్ల కోసం అమెరికా స్పెషల్‌ ఫోర్స్‌ కూడా దీనిని వినియోగించింది. ఆకర్షణీయమైన ఫీచర్లతో కాగితంపై బలంగా ఉన్నా.. దీనికి ఓ మచ్చకూడా ఉంది.. సురక్షితమైంది అన్న పేరుండటంతో వీవీఐపీలు కూడా దీనిలోనే ప్రయాణిస్తుంటారు. గత 20 ఏళ్లలో ఈ ఎంఐ-17 సిరీస్‌ హెలికాప్టర్లకు జరిగిన ప్రమాదాల్లో పలువురు వీఐపీలు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో 2010 నుంచి ఏడు సార్లు ఈ హెలికాప్టర్లు కూలిపోయాయి. అందులో ఒక సారి మాత్రం విమాన విధ్వంసక వ్యవస్థ ‘స్పైడర్‌’ దాడి చేసి కూల్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 2021లోనే ఐదు ఎంఐ-17 హెలికాప్టర్లు కూలిపోయాయి.

ప్రమాదాల జాబితా ఇదే..

* 2000 సెప్టెంబర్‌ 16వ తేదీన శ్రీలంకలోని కెగల్లా జిల్లాలో ఒక ఎంఐ-17 హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో శ్రీలంక మంత్రి ఎంహెచ్‌ఎం అష్రాఫ్‌ సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణ మార్గం స్పష్టంగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తేల్చారు.

* 2003 డిసెంబర్‌ 15వ తేదీన పోలాండ్‌ ప్రధానమంత్రి ప్రయాణిస్తున్న ఎంఐ హెలికాప్టర్‌ కూలిపోయింది. అదృష్టవశాత్తు ప్రధాని లెస్జెక్‌ మిల్లర్‌ సహా మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు.

* 2005 జులై 30వ తేదీన సౌత్‌ సూడాన్‌ అధ్యక్షుడి ఎంఐ-17 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఆ దేశ అధ్యక్షుడు జాన్‌ గరాంగ్‌ సహా మరో 14 మంది మరణించారు.

* 2009 జనవరి 14న అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌ ప్రావిన్స్‌లో ఎంఐ-17 కూలిపోయింది. దీనిలో అఫ్గాన్‌లోని కీలకమైన నలుగురు సైనిక జనరల్స్‌లో ఒకరైన మేజర్‌ జనరల్‌ ఫజల్‌ అహ్మద్‌ సయార్‌ మృతి చెందారు.

* 2015 మే8వ తేదీన పాకిస్థాన్‌లోని గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ ఒక ఎంఐ-17 హెలికాప్టర్‌ కూలిపోయింది. దీనిలో నార్వే, ఫిలిప్పీన్స్‌ రాయబారులు, వారి సతీమణులు, మలేషియా, ఇండోనేషియా రాయబారులు, ఇద్దరు పాకిస్థాన్‌ మేజర్లు మరణించారు. డచ్‌ రాయబారి తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పాక్‌ ఆయా దేశాలకు క్షమాపణలు కూడా చెప్పింది.

* 2016 ఆగస్టు 4వ తేదీన పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఎంఐ-17 మరమ్మతుల నిమిత్తం రష్యా వెళుతుండగా.. అఫ్గానిస్థాన్‌లో కూలిపోయింది. అందులోని వారిని తాలిబన్లు బంధించారు. వారిని విడిపించడానికి పాక్‌ నానా కష్టాలు పడింది.

* 2018 జనవరి 3వ తేదీన బంగ్లాదేశ్‌ వాయుసేనకు చెందిన ఓ ఎంఐ-17 హెలికాప్టర్‌ కూలిపోయింది. దీనిలో కువైట్‌ ఆర్మీ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మహమ్మద్‌ అల్‌ కుదేర్‌, కువైట్‌ నేవీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఖలీద్‌ అహ్మద్‌ అబ్దుల్‌ ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

* 2021 నవంబర్‌ 30వ తేదీన అజర్‌బైజన్‌లో హెలికాప్టర్‌ కూలి 14 మంది సైనిక సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు కర్నల్‌లు, ఐదుగురు మేజర్‌లు, నలుగురు కెప్టెన్లు, ఇద్దరు లెఫ్టినెంట్‌లు ఉన్నారు. అజర్‌బైజన్‌ చరిత్రలో అత్యధిక మంది చనిపోయిన ప్రభుత్వ హెలికాప్టర్‌ ప్రమాదం ఇదే.

* 2021 డిసెంబర్‌ 8న తమిళనాడులో జరిగిన ప్రమాదంలో భారత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, డీడబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు మధులతా రావత్‌, ఒక బ్రిగేడియర్‌ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 

భారత్‌లో జరిగినవి..

* 2010 నవంబర్‌ 19న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్ద ఎంఐ హెలికాప్టర్‌ కూలి 12 మంది మరణించారు.

* 2012 ఆగస్టు 30వ తేదీన గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వద్ద ఎంఐ-17 కూలి 9 మంది మరణించారు. 

* 2013 జూన్‌ 25వ తేదీన ఉత్తరాఖండ్‌లోని గౌరికుండ్‌ వద్ద హెలికాప్టర్‌ కూలి 8 మంది గాయపడ్డారు.

* 2017 అక్టోబర్‌ 6వ తేదీన తవాంగ్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

* 2018 ఏప్రిల్‌ 3వ తేదీన కేధార్‌నాథ్‌ వద్ద ఎంఐ హెలికాప్టర్‌ కూలి నలుగురు గాయపడ్డారు.

* 2019 ఫిబ్రవరి 27న కశ్మీర్‌లోని బుద్గామ్‌ వద్ద స్పైడర్‌ వ్యవస్థ ఎంఐ17ను కూల్చేసింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని