Journalist daughter: తండ్రి కోసం ఆరాటం.. ఆమె నోట ప్రసంగమై..!

‘ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలనే స్వేచ్ఛ ప్రతి భారతీయుడికి ఉంది. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఇదంతా’ అంటూ ఓ తొమ్మిదేళ్ల బాలిక మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Updated : 17 Aug 2022 15:22 IST

నెట్టింట్లో వైరల్‌గా తొమ్మిదేళ్ల చిన్నారి మాటలు

దిల్లీ: ‘ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలనే స్వేచ్ఛ ప్రతి భారతీయుడికి ఉంది. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఇదంతా’ అంటూ ఓ తొమ్మిదేళ్ల బాలిక మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంత చిన్నవయసులో ఆ చిన్నారి నోట ఆ మాటలు వినిపించడానికి గల కారణం ఆమె తండ్రి. జైలులో బంధీగా ఉన్న నాన్నకోసం ఎదురుచూపే.. స్వాతంత్య్ర వేడుకల వేళ ఆమె ప్రసంగమైంది.

కేరళకు చెందిన ఈ తొమ్మిదేళ్ల బాలిక పేరు మెహనాజ్‌. ఆమె తండ్రి  సిద్దిఖీ కప్పాన్‌ ఒక పాత్రికేయుడు. 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్‌(యూపీ) అత్యాచార ఘటన వివరాలను కవర్‌ చేయడానికి వెళ్తోన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. దీని గురించి బాధపడుతోన్న మెహనాజ్‌.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తన ఆవేదనను వ్యక్తం చేసింది.

‘మా నాన్న ఒక పాత్రికేయుడు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉన్న ప్రాథమిక హక్కులను తిరస్కరించారు. ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏం మతాన్ని అనుసరించాలనే స్వేచ్ఛ ప్రతి భారతీయుడికి ఉంది. గాంధీ, నెహ్రూ, భగత్‌ సింగ్‌ వంటి సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ఇదంతా సాధ్యమైంది. వారిని గుర్తు చేసుకుంటూ.. సామాన్య ప్రజల స్వేచ్ఛ, హక్కులను హరించవద్దని అభ్యర్థిస్తున్నాను. అశాంతి ఛాయలను తుడిచిపెట్టేయాలి. భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మనమంతా కలిసికట్టుగా సాగాలి. ఎటువంటి విభజనలు లేకుండా మెరుగైన భవిష్యత్తు కోసం కలలు కనాలి’ అంటూ ఆమె చేసిన అభ్యర్థన ఆలోచింపజేస్తోంది. 

2020లో హథ్రాస్‌లో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు తర్వాత మరణించింది. ఆమె మృతదేహానికి పోలీసులు హడావుడిగా దహన సంస్కారాలు  చేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అల్లర్లు చెలరేగవచ్చనే నిఘా వర్గాల సమాచారం మేరకే తాము ఈ చర్యకు పాల్పడ్డామని యూపీ పోలీసులు సుప్రీం కోర్టుకు వెల్లడించారు. కాగా, ఈ ఘటనలను రిపోర్ట్ చేయడానికి బయలుదేరిన కప్పాన్‌ను పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. హథ్రాస్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించాడంటూ అభియోగాలు మోపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని