Delhi: మంత్రి పదవులకు సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ రాజీనామా

దిల్లీలోని ఆప్‌(AAP) ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు వైదొలిగారు. పలు ఆరోపణలపై అరెస్టయిన సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ల రాజీనామాలను సీఎం కేజ్రీవాల్‌ ఆమోదించారు.

Updated : 28 Feb 2023 20:17 IST

దిల్లీ: దిల్లీ(Delhi) రాజకీయాల్లో కీలక పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మద్యం కుంభకోణం(Delhi liquor scam) కేసులో అరెస్టయిన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా(Manish sisodia), అంతకుముందు మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌(Satyendar Jain)లు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్‌ ఆమోదించారు. అయితే, వీరిద్దరి రాజీనామాలు పరిపాలనా చర్యల్లోనే భాగం తప్ప ఏవిధంగానూ నేరాన్ని అంగీకరించినట్టు కాదని ఆప్‌ స్పష్టంచేసింది. అయితే, మరో ఇద్దరు మంత్రులకు వీరి శాఖలను అప్పగించి..  కొత్త మంత్రులుగా కేబినెట్‌లోకి ఎవరినీ తీసుకొనే అవకాశం లేదని ఆప్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అరెస్టయిన నేతలను ఇంకా కేబినెట్‌లో కొనసాగిస్తుండటంపై భాజపా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక మంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు రాజీనామా చేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. 

అప్పటివరకు మంత్రి పదవిలో ఉండను.. లేఖలో సిసోదియా

తనపై వచ్చిన ఆరోపణలు తప్పని రుజువయ్యేంత వరకు మంత్రి పదవికి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు సిసోదియా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను సీఎం కేజ్రీవాల్‌కు పంపారు. మరికొన్ని కేసులు సైతం తనపై ఉండొచ్చని.. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమేనన్నారు. ఈ ఆరోపణలు పిరికిపందలు, బలహీనుల కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. వాళ్ల లక్ష్యం తాను కాదని.. అర్వింద్‌ కేజ్రీవాలేనన్నారు. అవినీతికి పాల్పడేలా తనను ఎవరూ బలవంతం చేయలేరని..  దేశ స్వాతంత్ర్య సమరయోధులే తనకు బలమన్నారు. నిజం కోసం పోరాడటమే తమకు రాజకీయ బలాన్ని అందించిందని.. లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాలల చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశీస్సులు తమకు ఉన్నాయన్నారు. 

ఆ శాఖలు మరో ఇద్దరికి కేటాయింపు!

దాదాపు 9 నెలలుగా సత్యేందర్‌ జైన్‌ జైలులో ఉండటంతో ఆయన నిర్వహించిన ఆరోగ్యశాఖతో పాటు మొత్తం 18 మంత్రిత్వశాఖలకు సిసోదియానే ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం దిల్లీ కేబినెట్‌లో సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇటు పార్టీలోను, అటు ప్రభుత్వంలో కూడా కేజ్రీవాల్‌ తర్వాత నంబర్‌-2గా సిసోదియానే ఉన్నారు. సత్యేందర్‌ జైన్‌ అరెస్టు తర్వాత ఆయన మంత్రిత్వశాఖలను సైతం సిసోదియానే నిర్వహిస్తూ వచ్చారు. కేజ్రీవాల్‌ ఆప్‌ జాతీయ ప్రణాళికలు చూసే బాధ్యతల్లో నిమగ్నం కావడంతో ఎక్కువ శాఖలు సిసోదియానే చూస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సిసోదియా నిర్వహించిన శాఖల బాధ్యతల్ని కైలాశ్‌ గహ్లోత్‌; సత్యేందర్‌ జైన్‌ శాఖల్ని రాజ్‌కుమార్‌ ఆనంద్‌ చూడనున్నట్టు సమాచారం.

సిసోదియా నిర్వహించిన 18శాఖలివే..

విద్య, ఆర్థిక, ప్రణాళిక, భూములు-భవనాలు‌, విజిలెన్స్‌, సర్వీసెస్‌, పర్యాటకం, కళలు-సంస్కృతి-భాష‌, కార్మిక‌, ఉపాధి, పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌, ఆరోగ్యం, పరిశ్రమలు, విద్యుత్‌, హోంశాఖ, పట్టణాభివృద్ధి, ఇరిగేషన్‌-ఆహార నియంత్రణ, జలవనరుల మంత్రిత్వశాఖల బాధ్యతలను సిసోదియా నిర్వర్తించారు.

కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో గతేడాది మే 30న సత్యేందర్‌ జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే, మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోదియాను సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆదివారం సాయంత్రం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఆప్‌లో చాలా ముఖ్యమైన నేతలు. పంజాబ్‌లో విజయం సాధించి, గోవా, గుజరాత్‌ ఎన్నికల్లో భారీగానే ఓట్లు రాబట్టుకొని జాతీయ పార్టీ హోదాను సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటాలని దూకుడుగా ఉన్న ఆప్‌కు ఈ ఇద్దరు నేతల అరెస్టు వ్యవహారం ఇబ్బందికరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని