Total Solar Eclipse: సంపూర్ణ సూర్యగ్రహణం.. మన ‘ఆదిత్య’కు చిక్కదట..!

Total Solar Eclipse: భానుడిపై అధ్యయనం సాగిస్తున్న మన ‘ఆదిత్య ఎల్‌ 1’ మిషన్‌.. నేటి సంపూర్ణ సూర్య గ్రహణాన్ని తన కెమెరాల్లో బంధించలేదట. అందుకు కారణమేంటో తెలుసా?

Published : 08 Apr 2024 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వంలో నేడు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా నేడు సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse) ఏర్పడనుంది. ఈ ఏడాది సంభవించే అతిపెద్ద ఖగోళ ఘటన, పైగా అరుదుగా ఏర్పడే సంపూర్ణ గ్రహణం కావడంతో దీన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ఘట్టాన్ని అంతరిక్షంలో ఉన్న మన ‘ఆదిత్య’ మాత్రం చూడలేడట..! ఇందులో ఇస్రో (ISRO) తప్పేం లేదండోయ్‌.. ‘ఆదిత్య ఎల్‌ 1 (Aditya L1)’ను ఉంచిన స్థానమే ఇందుక్కారణం.

సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో గ్రహణాల ప్రభావం లేకుండా ‘ఆదిత్య ఎల్‌ 1’కు భానుడు ప్రతిక్షణం కన్పిస్తాడు. సాధారణంగా సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. అయితే, నేటి సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో భానుడిని పూర్తిగా కమ్మేసే చంద్రుడు ఈ శాటిలైట్‌కు వెనుకవైపు ఉంటాడు. అంటే.. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో అన్నమాట..! అందుకే గ్రహణ ఘట్టాన్ని ‘ఆదిత్య ఎల్‌ 1’ వీక్షించలేదని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ వెల్లడించారు.

అయితే, గ్రహణ సమయంలో సూర్య కిరణాల ప్రభావం ఎలా ఉండనుందనే విషయాలను ఈ మిషన్‌ పరిశీలించనుంది. క్రోమోస్పియర్‌, నక్షత్రాల కరోనాను మరింత అధ్యయనం చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబరులో ‘ఆదిత్య ఎల్‌ 1’ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు రోదసిలో ప్రయాణించిన శాటిలైట్‌.. ఈ ఏడాది జనవరిలో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ పాయింట్‌-1ను చేరుకుంది. దాని చుట్టూ ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనాలు సాగిస్తోంది.

ఇక, నేటి సంపూర్ణ సూర్య గ్రహణం మెక్సికో, అమెరికా, కెనడాల మీదుగా ప్రయాణించనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణ ప్రభావాన్ని బట్టి కొన్ని నిమిషాల పాటు చీకటి కమ్ముకోనుంది. అయితే, భారత్‌లో దీని ప్రభావం లేదు. మన కాలమానం ప్రకారం నేటి రాత్రి 9 గంటల తర్వాత నుంచి రేపు తెల్లవారుజామున 2.22 గంటల వరకు గ్రహణ కాలం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు