Air India: పైలట్‌ రాక ఆలస్యం.. రెండు గంటలు నిరీక్షించిన ప్రయాణికులు

రెండ్రోజుల వ్యవధిలో వేర్వేరు కారణాలతో రెండు ఎయిరిండియా విమానాలు ఆలస్యమయ్యాయి. పైలట్‌ కారణంగా ఒకటి, సాంకేతిక లోపంతో మరొకటి ఆలస్యంగా బయల్దేరాయి.

Updated : 27 Sep 2023 16:34 IST

దిల్లీ: ఇటీవలి కాలంలో విమానాలు (Flights) ఆలస్యంగా టేకాఫ్‌ అవుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. బాంబు ఉందని కొందరు ఫోన్ చేయడం, ఇంజిన్‌లో సాంకేతిక లోపం, ప్రయాణికుల అనుచిత ప్రవర్తన వంటి కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. కానీ, పైలట్‌ లేటుగా రావడంతో ఓ విమానం లేటుగా బయల్దేరిన ఘటన సోమవారం దిల్లీ - పుణె ఎయిరిండియా విమానంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

ఎయిరిండియాకు చెందిన AI853 విమానం సోమవారం రాత్రి 7:10కి దిల్లీ నుంచి బయల్దేరి 9:10కి పుణె చేరుకోవాలి. షెడ్యూల్‌ ప్రకారం విమాన సిబ్బంది బోర్డింగ్ పాస్‌లు జారీ చేయడంతో ప్రయాణికులంతా విమానంలో కూర్చుకున్నారు. అయితే, ఎంతసేపయినా.. విమానం టేకాఫ్‌ కాలేదు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు కేబిన్‌ సిబ్బందిని ప్రశ్నించడంతో.. పైలట్‌ రాలేదనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎట్టకేలకు రెండు గంటలు ఆలస్యంగా పైలట్ రావడంతో విమానం రాత్రి 10:35కి బయల్దేరి, 11:15కి పుణె చేరుకుంది. ఆ సమయంలో విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి పలువురు ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో ఎయిరిండియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎయిరిండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఈ-మెయిల్‌ చూడని వైనం.. ‘బెయిల్‌’ వచ్చినా 3 ఏళ్లు జైల్లోనే!

ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్

బుధవారం మరో ఎయిరిండియా విమానం సైతం ఆలస్యంగా బయల్దేరింది. కేరళలోని కోయ్‌కోడ్‌ నుంచి దుబాయ్‌కి వెళుతున్న ఎయిరిండియా విమానం (IX345) ఉదయం 9:53కి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఫైర్‌ అలారమ్‌ మోగడంతో కన్నూర్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. అనంతరం విమానాన్ని తనిఖీ చేసిన సిబ్బంది సాంకేతిక లోపం కారణంగా అలారమ్‌ మోగినట్లు గుర్తించారు. ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని