ఈ-మెయిల్‌ చూడని వైనం.. ‘బెయిల్‌’ వచ్చినా 3 ఏళ్లు జైల్లోనే!

ఓ కేసులో దోషికి హైకోర్టు బెయిల్‌ ఇచ్చినప్పటికీ.. అందుకు సంబంధించి ఈ-మెయిల్‌లో వచ్చిన ఆర్డరు కాపీని అధికారులు తెరవకపోవడంతో అతడు మూడేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది.

Published : 27 Sep 2023 14:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ కేసులో శిక్ష అనుభవిస్తోన్న వ్యక్తి.. బెయిల్‌ (Bail) కోసం ప్రయత్నించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం అతడికి శాపంగా మారింది. న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చినప్పటికీ.. అందుకు సంబంధించి ఈ-మెయిల్‌లో వచ్చిన ఆర్డరు కాపీని (e-mail attachment) అధికారులు తెరవకపోవడంతో అతడు మూడేళ్లపాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (High Court).. నిందితుడికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉదంతం గుజరాత్‌లో వెలుగు చూసింది.

గుజరాత్‌కు చెందిన చందన్‌జీ ఠాకూర్‌ (27) ఓ హత్య కేసులో దోషి. దీంతో అతడు జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అయితే, సెప్టెంబర్‌ 29, 2020న అతడి శిక్షను గుజరాత్‌ హైకోర్టు నిలిపివేసింది. ఇందుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రీ జైలు అధికారులకు ఆర్డరు కాపీని ఈ-మెయిల్‌లో పంపించింది. కానీ, జైలు అధికారులు మాత్రం మెయిల్‌లో ఉన్న అటాచ్‌మెంట్‌ను తెరచి చూడలేదు. దాంతో ఇప్పటివరకు (2023 వరకు) జైల్లోనే ఉండాల్సి వచ్చింది. తాజాగా అతడు బెయిల్‌ కోసం మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది.

ఈ అంశాన్ని గుజరాత్‌ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ‘బెయిల్‌ ఆర్డరు కాపీలు కోర్టు రిజిస్ట్రీ నుంచి జైలు అధికారులకు చేరినప్పటికీ అందులోని అటాచ్‌మెంట్‌ను మాత్రం ఓపెన్‌ చేయలేకపోయారు. అంతేకాకుండా ఆ ఈ-మెయిల్‌ను జిల్లా సెషన్స్‌ కోర్టుకు పంపినప్పటికీ.. అక్కడ కూడా సరైన పర్యవేక్షణ కనిపించలేదు. దరఖాస్తుదారుడికి బెయిల్‌ వచ్చినప్పటికీ ఆ స్వేచ్ఛను అతడు ఆస్వాదించలేకపోయాడు’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. బాధితుడి దీనస్థితిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. అధికారులు నిర్లక్ష్యం వహించినందుకు గాను అతడికి రూ.లక్ష పరిహారాన్ని అందించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా కొవిడ్‌ సమయంలో ఇలా మెయిల్‌లో ఇచ్చిన ఆదేశాలన్నీ అమలయ్యాయా..? లేదా అనే విషయాన్ని తెలియజేయాలని జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీకి సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని