Sanjay Raut: నేను విజయ్‌ మాల్యానా? నీరవ్‌ మోదీనా?: ఆస్తుల జప్తుపై సంజయ్‌ రౌత్‌ ప్రశ్న

భూ కుంభకోణం కేసులో తన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈడీపై విమర్శలు గుప్పించారు......

Published : 06 Apr 2022 02:17 IST

ముంబయి: భూ కుంభకోణం కేసులో తన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈడీపై విమర్శలు గుప్పించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి పారిపోయిన వ్యాపారవేత్తలతో తనను పరిగణిస్తారా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని, లేదంటే ఈడీ సోదాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనపై రెండేళ్లుగా ఒత్తిడి ఉందని రౌత్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను రాజ్యసభ ఛైర్మన్‌కు గతంలోనే తెలియజేసినట్లు వెల్లడించారు.

‘ఇది రాజకీయ ప్రతీకారమే. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని గత రెండేళ్లుగా నామీద ఒత్తిడి ఉంది. లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు. పలుమార్లు నన్ను బెదిరించారు. ఈడీ సోదాల విషయం గురించి గతంలోనే నేను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడికి వివరించాను’ అని పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఆస్తి’ అనే పదానికి అర్థం తెలుసుకోవాలని సూచించారు. నేను విజయ్‌ మాల్యానా? మెహుల్‌ చోస్కీనా? లేక నీరవ్‌ మోదీనా? అని ప్రశ్నించారు.

‘నా స్వస్థలంలో ఓ చిన్న ఇంట్లో ఉంటా. నాకు సొంతంగా ఒక్క ఎకరం భూమి కూడా లేదు. నాకు ఏదైతే ఉందో అది నా కష్టార్జితం. ఇక్కడ ఏదైనా మనీలాండరింగ్‌ జరిగినట్లు దర్యాప్తు సంస్థ భావిస్తోందా? మీరు నన్ను ఎవరితో ముడిపెడుతున్నారు?’ అని రౌత్‌ వ్యాఖ్యానించారు. ‘సంజయ్‌ రౌత్‌ అనే వ్యక్తి బాబాసాహెబ్‌ ఠాక్రే అనుచరుడు. శివసేన సైనికుడు. నన్ను జైలుకు పంపినా, ఆస్తులు స్వాధీనం చేసుకున్నా, షూట్‌ చేసినా నన్ను ఎవరూ భయపెట్టలేరు’ అని ఘాటుగా స్పందించారు.

అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద సంజయ్ రౌత్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన ముంబయి అలీబాగ్‌లోని ఎనిమిది ప్లాట్ల భూమిని, దాదర్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌ను ఈడీ మంగళవారం జప్తుచేసింది. ముంబయిలోని పాత్రచల్ అభివృద్ధి ప్రాజెక్టులో రూ.1034కోట్ల విలువైన భూకుంభకోణం జరిగిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన ఈడీ..  అభియోగపత్రం సైతం దాఖలు చేసింది. పీఎంసీ బ్యాంక్ మోసం కేసులో గతేడాది సంజయ్ రౌత్ సతీమణి వర్ష రౌత్‌ను విచారించిన ఈడీ అధికారులు ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో ఉన్న సంబంధాలపై సైతం వర్షరౌత్‌ను ఆరాతీశారు. తాజాగా పాత్రచాల్  భూకుంభకోణం కేసులో సంజయ్ రౌత్ సహా ఆయన కుటుంబసభ్యుల భూములు, ఫ్లాట్‌ను జప్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని