Amit Shah: ‘అసహనంతోనే ఫేక్‌ వీడియోలు’ : కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్‌ షా

నకిలీ వీడియో ఘటనపై భాజపా అగ్రనేత అమిత్‌ షా (Amit Shah).. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ఆ పార్టీ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. 

Updated : 30 Apr 2024 12:05 IST

దిల్లీ: రిజర్వేషన్ల రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) చెప్పినట్లు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అమిత్‌ షా దీనిపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ అసహనంతోనే ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని మండిపడ్డారు. తమ మాటలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు భాజపా వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు.

‘‘400 సీట్లు దక్కించుకున్న తర్వాత భాజపా రిజర్వేషన్లను రద్దుచేస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆ మాటలన్నీ నిరాధారమైనవి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు మా పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేస్తున్నాను. నాతోపాటు మా పార్టీకి చెందిన ఇతర నేతల నకిలీ వీడియోలను ప్రచారం చేసే స్థాయికి వారి అసహనం పెరిగిపోయింది. ముఖ్యమంత్రులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇతరులు ఈ ఫేక్ వీడియోను వ్యాప్తి చేశారు. ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన ఒక ప్రముఖనేత క్రిమినల్ నేరాన్ని ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ వారి అసంతృప్తిని వెల్లడిచేస్తున్నాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాజకీయాలను మరింత దిగజార్చేపనిలో ఉన్నారు. ఈ తరహా దృశ్యాలను ప్రచారం చేసి, ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఏ ప్రధాన పార్టీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు’’ అని అమిత్‌ షా అన్నారు.

అమిత్‌ షా ‘వీడియో సోర్స్‌’పై పోలీసుల దృష్టి.. సోషల్‌ మీడియా సంస్థలకు లేఖ

కర్ణాటకలో తమ మిత్రపక్షం జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెప్తున్న అభ్యంతరకర వీడియోలపై స్పందించారు. ‘‘దేశంలో మేం మాతృ శక్తికి అండగా నిలుస్తామన్నది స్పష్టం. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ?అది ఆ రాష్ట్ర శాంతిభద్రతల అంశం. మేం విచారణకు అనుకూలంగా ఉన్నాం. ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని జేడీఎస్‌ కూడా ఇప్పటికే ప్రకటించింది’’ అని తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నియోజకవర్గాలైన అమేఠీ, రాయబరేలీలో రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీ పోటీ గురించి అడగ్గా..‘‘వారు బరిలో ఉంటారా? లేదా? అనేది తెలీదు. అయితే వారిలో గందరగోళం చూస్తుంటే.. ఆత్మవిశ్వాసం లేనట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు సొంత సీట్లను వదిలిపారిపోయిన పరిస్థితి ఉంది’’ అని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని