Amritpal Singh: అమృత్‌పాల్‌ లొంగిపోనున్నాడా..?

పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుతిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా సంస్థల కథనం ప్రకారం.. 

Updated : 29 Mar 2023 18:53 IST

చండీగఢ్‌: పరారీలో ఉన్న ఖలిస్థానీ(Khalistan) సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh).. పంజాబ్‌(Punjab)కు తిరిగిరానున్నాడా..? పోలీసుల ముందు లొంగిపోనున్నాడా..? వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. అతడు పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉన్నటు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. అతడి ఆచూకీ కోసం అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా అతడిని అరెస్టు చేస్తామని మంగళవారం పంజాబ్ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. ఈ క్రమంలోనే అమృత్‌ పాల్ బుధవారం అమృత్‌సర్‌లో లేక భటిండాలో లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh)కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను కొద్దివారాల క్రితం పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు మరో దారిలేక లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై కేసు నమోదు చేసింది.

దాంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు పంజాబ్(Punjab) పోలీసులు పక్కా వ్యూహ రచనచేశారు. కానీ అతడు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి కొన్ని రోజులుగా వాహనాలు, వేషాలు మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడు దేశం దాటినట్టు  కథనాలు వెలువడ్డాయి. అయితే  పోలీసుల అనధికార కస్టడీలో అమృత్‌పాల్‌(Amritpal Singh) ఉన్నాడని, ఆచూకీ చెప్పాలంటూ ఇమాన్‌ సింగ్‌ ఖారా అనే న్యాయవాది  పంజాబ్‌, హరియాణా హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. అయితే ఆయనను ఇంకా అరెస్టు చేయలేదని, దర్యాప్తు సంస్థలన్నీ కలిసి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని, త్వరలోనే అరెస్టు చేస్తామని కోర్టుకు పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ వినోద్‌ ఘాయ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే లొంగిపోవడం గురించి వార్తలు వస్తున్నాయి. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు