కొత్తరకం జీవికి చంద్రయాన్‌ పేరు

భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్‌’కు అరుదైన గౌరవం దక్కింది.

Published : 03 May 2024 05:29 IST

కోచి: భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్‌’కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి  దీని పేరు పెట్టారు. ఈ జీవికి ‘బాటలిప్స్‌ చంద్రయానీ’ అని నామకరణం చేశారు. ఇది మెరైన్‌ టార్డిగ్రేడ్‌ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు. వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి. ఈ జాతిజీవులకు సాగర జీవం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర ఉంది. ‘‘ఈ జీవులను పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఇవి నీటి కింద ఉంటాయి. ఈ జాతి జీవుల గురించి పరిశోధనకు బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం. వీటి గురించి శోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు దేశంలో పెద్దగా లేవు’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న బిజోయ్‌ నందన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.టార్డిగ్రేడ్‌లు నీటి ఎలుగుబంట్లు అని కూడా పిలుస్తారు. ఇది సూక్ష్మజీవులే అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటుంది. పుడమిపై చోటుచేసుకున్న ఐదు భారీ జీవ అంతర్ధానాలను ఈ జాతి తట్టుకొని నిలబడింది. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమించగలవు. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ తొలి జీవి ఇదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని