మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది.

Updated : 03 May 2024 10:05 IST

సోలన్‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. కార్మికుల దినోత్సవమైన మే 1న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పర్వానూ పారిశ్రామిక ప్రాంతంలో ఓ కంపెనీ కొన్నాళ్ల క్రితం మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. దీంతో చేసేదేం లేక కార్మికులు కంపెనీ వద్ద సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది. గడ్డం, మీసం తీసేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని షరతు పెట్టింది. అందుకు కార్మికులు తొలుత అంగీకరించలేదు. తర్వాత యాజమాన్యం షరతుకు అంగీకరించి గడ్డం, మీసం తీసేశారు. అయినా సిబ్బందిని కంపెనీ విధుల్లోకి తీసుకోలేదు. ఈ క్రమంలో కార్మికులు హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు, పర్వానూ లేబర్‌ కమిషనర్‌, సోలన్‌ జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పర్వానూ లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌ లలిత్‌ ఠాకుర్‌ కంపెనీని సందర్శించి యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఉద్యోగుల తొలగింపు ఘటన నిజమని తేలితే కంపెనీపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ మన్మోహన్‌ శర్మ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని