సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది.

Published : 03 May 2024 05:34 IST

విచారణను ప్రభుత్వం పర్యవేక్షించదు : సొలిసిటర్‌ జనరల్‌ 

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్రం ఈ మేరకు పేర్కొనడం గమనార్హం. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం.. కేసులు నమోదు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా గురువారం కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌(ఎస్జీ) తుషార్‌ మెహతా తన వాదనలు వినిపించారు. సీబీఐకి కేంద్రానికి సంబంధం లేదన్నారు. ‘‘సీబీఐపై నియంత్రణ కేంద్రం దగ్గర ఉండదు. నేర నమోదు, కేసు విచారణ, అభియోగపత్రం మూసివేత, శిక్ష, విడుదల.. వీటిలో వేటినీ ప్రభుత్వం పర్యవేక్షించదు’’ అని మెహతా తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణం 131 ప్రకారం వేసిన పిటిషన్‌లో కేంద్రాన్ని రాష్ట్రం ప్రతివాదిగా చేయడంపైనా మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ విచారణార్హం కాదని తెలిపారు. రాష్ట్రం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌.. ఎస్జీ వాదనలను తోసిపుచ్చారు. కేంద్రపరిధిలోనే సీబీఐ ఉంటుందని డీఎస్‌పీఈ చట్టంలోని సెక్షన్లను ఉటంకించారు. పార్లమెంటులో కూడా సీబీఐ ప్రశ్నలు అడిగినపుడు సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖే సమాధానం చెబుతుందని అన్నారు. డీఎస్‌పీఈలో సెక్షన్‌ 6ని పేర్కొంటూ.. ఒక్కసారి రాష్ట్రం సాధారణ సమ్మతి ఉపసంహరించుకుంటే సీబీఐకి  అడుగుపెట్టే అధికారం ఉండదని అన్నారు. ‘‘ఇప్పుడు ఏం జరుగుతోందంటే.. సీబీఐని అడుగుపెట్టనిస్తే వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రవేశిస్తోంది. ఈ ధోరణితో దేశ రాజకీయాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి’’ అని సిబల్‌ తెలిపారు. ఈ కేసులో తదుపరి వాదనలు ఈ నెల 9న ధర్మాసనం విననుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని