ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు లుక్‌ఔట్‌ నోటీసులు

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్‌) అధికారులు గురువారం లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

Published : 03 May 2024 05:35 IST

ఈనాడు, బెంగళూరు: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్‌) అధికారులు గురువారం లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే తనకు జారీ చేసిన నోటీసులకు బదులిచ్చిన ప్రజ్వల్‌.. విచారణకు మరోవారం గడువు ఇవ్వాలని విన్నవించారు. తాను విదేశాల నుంచి తిరిగివచ్చే టికెట్‌ తేదీలను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేస్తూ విజ్ఞప్తి చేశారు. విచారణకు హాజరు కాకపోతే దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర హోంమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో ఏ1 నిందితుడు ప్రజ్వల్‌ తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డి.రేవణ్ణ.. మధ్యంతర జామీను కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయనపై దాఖలైన కేసులో జామీను ఇవ్వదగిన ఆరోపణలు ఉండటంతో నేరుగా విచారణకు హాజరుకావాలి కదా అని రేవణ్ణ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. గురువారం ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయాలని సిట్‌కి కోర్టు తాఖీదులు జారీచేసింది.

 దౌత్యవీసా మీదే జర్మనీకి ప్రజ్వల్‌..

ప్రజ్వల్‌ దౌత్యపరమైన పాస్‌పోర్టు మీదే జర్మనీ వెళ్లారని.. ఆ ప్రయాణానికి రాజకీయ ఆమోదాన్ని ఆయన అడగలేదని, ఎవరూ దానిని ఇవ్వలేదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. రేవణ్ణ విదేశాలకు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందన్న విమర్శల నేపథ్యంలో.. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలంటే న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావాలని.. తమకు అలాంటివేమీ అందలేదని తెలిపారు. జర్మనీకి వెళ్లడానికి ఎలాంటి వీసా అవసరం లేదన్నారు. మరే ఇతర దేశానికి వెళ్లేందుకూ తాము వీసా జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యులకు దౌత్యవీసా ఉంటుందని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని