2జీ స్పెక్ట్రమ్‌పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ

స్పెక్ట్రమ్‌ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

Published : 03 May 2024 05:38 IST

దిల్లీ: స్పెక్ట్రమ్‌ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్పష్టత కోసమని దాఖలు చేసిన పిటిషన్‌ అసలు ఉద్దేశం తీర్పును సమీక్షించాలన్నట్లుగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. సర్వోన్నత న్యాయస్థానం 2013లో జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వ అభ్యర్థనను రిజిస్ట్రీ తిరస్కరించింది. ‘ఏదైనా పిటిషన్‌ సహేతుకమైన కారణాన్ని వివరించకున్నా, యోగ్యతలేకున్నా, మోసపూరితంగా ఉన్నా రిజిస్ట్రీ దానిని తిరిస్కరించవచ్చు’నని ఆ నిబంధన చెబుతోంది. రిజిస్ట్రీ నిర్ణయంపై అభ్యంతరాలుంటే పిటిషనర్‌ 15 రోజుల్లోగా ఆ విషయాన్ని అప్పీలు ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన వాణిజ్యేతర అవసరాలకు 2జీ స్పెక్ట్రమ్‌ను వేలం లేకుండానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ఏప్రిల్‌ 22న సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనానికి తెలిపారు. దీని కోసం 2012 తీర్పులో మార్పులు చేయాలని, ఈ అంశాన్ని అత్యవసరంగా విచారణకు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చట్ట నిబంధనలను పాటిస్తూనే పాలనా విధానాల ప్రకారం స్పెక్ట్రమ్‌ను కేటాయించే విషయమై స్పష్టతను కోరుతున్నట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ విధుల నిర్వహణ కోసం సాంకేతిక, ఆర్థిక కారణాలకు అతీతంగా స్పెక్ట్రమ్‌ కేటాయింపులకు అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ అభ్యర్థనకు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అభ్యంతరం తెలిపారు. కేంద్ర మంత్రిగా ఎ.రాజా ఉన్న సమయంలో జరిగిన 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులన్నింటినీ సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వేలం విధానం ద్వారానే దేశ సహజ వనరుల కేటాయింపులు జరగాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌ను ఈమెయిల్‌ చేస్తే పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అప్పుడు తెలిపారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ పిటిషన్‌పై సందేహాలు వ్యక్తం చేస్తూ తిరస్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని