Calcutta High Court: కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. 36 వేలమంది టీచర్ల తొలగింపు!

Teacher appointments: 36వేల మంది టీచర్లను తొలగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సవాలు చేసేందుకు సిద్ధమవుతోంది.

Published : 13 May 2023 16:10 IST

కోల్‌కతా: ఉపాధ్యాయుల నియామకాల్లో కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు (Calcutta High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాల్లో గతంలో నియమితులైన 36 వేల మంది ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నియామక ప్రక్రియలో విధివిధానాలను పాటించలేదని పేర్కొంటూ వీరి నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ ఆదేశాలు జారీ చేశారు.

‘‘పశ్చిమ బెంగాల్‌లో 2016లో నియమితులైన 36 వేలమంది ఎలాంటి శిక్షణా తీసుకోకుండా నియమితులయ్యారు. కాబట్టి వీరి నియామకాలు చెల్లవు’’ అని జస్టిస్‌ గంగోపాధ్యాయ పేర్కొన్నారు. ఈ మేరకు 17 పేజీల తీర్పును వెలువరించించారు. రాబోయే మూడు నెలల్లో ఖాళీ ఏర్పడిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో తొలగించిన ఉపాధ్యాయులు నాలుగు నెలల పాటు పనిచేయొచ్చని, కానీ పారా టీచర్లకు ఇచ్చే జీతానికి పనిచేయాలని ఆదేశించారు. పశ్చిమ బెంగాల్‌లో ఇంతటి అవినీతిని తానెన్నడూ చూడలేదని జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ పేర్కొన్నారు. 

స్కూల్‌ జాబ్‌ ఫర్‌ క్యాష్‌ స్కామ్‌గా పేర్కొనే ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ప్రైమరీ ఎడ్యుకేషన్‌ మాజీ ఛైర్మన్‌ మాణిక్‌ భట్టాచార్య అరెస్ట్‌ అయ్యారు. మరోవైపు హైకోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ సర్కారు స్పందించింది. సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని, అనంతరం ఆదేశాలను సవాలు చేయనున్నామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని