Afghanistan: అఫ్గాన్‌లోనే చిక్కుకుపోయిన 20 మంది భారతీయులు..!

తాలిబన్ల ఆక్రమణలతో అఫ్గానిస్థాన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దేవీ శక్తి’

Published : 30 Aug 2021 23:35 IST

దిల్లీ: తాలిబన్ల ఆక్రమణలతో అఫ్గానిస్థాన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దేవీశక్తి’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. వందలాది మంది భారతీయులతో పాటు అఫ్గాన్‌ సిక్కులు, హిందువులను కూడా మానవతా దృక్పథంతో తరలించింది. కాగా.. దాదాపు 15-20 మంది భారతీయులు ఇంకా ఆ దేశంలోనే చిక్కుకుపోయినట్లు తాజా మీడియా కథనాల సమాచారం. 

అఫ్గాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండటంతో స్వదేశానికి వెళ్లేందుకు వారంతా కాబుల్‌ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అక్కడి విమానాశ్రయంలో నెలకొన్న యుద్ధవాతావరణం దృష్ట్యా వారి తరలింపు ఇప్పుడప్పుడే జరిగేలా కన్పించట్లేదు. కాబుల్‌ ఎయిర్‌పోర్టులో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పట్లో అక్కడకు భారత విమానాలు వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోవైపు అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ మంగళవారం నాటికి ముగించాలని అగ్రరాజ్యం నిర్ణయించిన విషయం తెలిసిందే. అమెరికా, నాటో దళాల సహకారంతోనే ఇప్పటివరకు భారత్‌ తరలింపు ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ 20 మందిని తరలించే విషయంపై సందిగ్ధత నెలకొంది. 

ఇదిలా ఉండగా.. ఈ ఉదయం కాబుల్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు జరిగాయి. అయితే విమానాశ్రయంలోని క్షిపణి విధ్వంసక వ్యవస్థ వాటిని గుర్తించి కూల్చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దాడులు జరిగినప్పటికీ అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని